నకిలీ ఆధార్‌లతో టీటీడీ గదుల బుకింగ్.. తెలంగాణ వ్యక్తి సహా ముఠా అరెస్ట్

by Vemula.Srinu Prasad |

నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ వసతి గదులను అక్రమంగా పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల II టౌన్ పోలీసులు అరెస్టు చేశారు..

నకిలీ ఆధార్‌లతో టీటీడీ గదుల బుకింగ్.. తెలంగాణ వ్యక్తి సహా ముఠా అరెస్ట్
X

దిశ, తిరుమల: నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ వసతి గదులను అక్రమంగా పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల II టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 నకిలీ ఆధార్ కార్డులు, 2 ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు, డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

తిరుమల సిఆర్ఓ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వీరు మొబైల్ యాప్‌ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి గదులు పొందుతున్నట్లు, ఆపై వాటిని భక్తులకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు.

తెలంగాణ వ్యక్తి సహా...

అరెస్ట్ అయిన వారిలో తెలంగాణకు చెందిన ఎం. వేణుగోపాల్, టి. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దొంత రవీంద్రబాబు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంతోష్ కుమార్ ఉన్నారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ అక్రమ దందాను ఛేదించిన సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ, అభినందించారు.

శ్రీవారి భక్తులు వసతి గదులను కేవలం అధికారిక కౌంటర్లు లేదా అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారానే పొందాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అధిక ధరలకు గదులు విక్రయిస్తే వెంటనే తిరుమల పోలీసులు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Next Story