Nirmala Sitaraman: 'వికసిత్ భారత్'లో భాగస్వాములు కండి

by S Gopi |

2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర విద్యుత్ సామర్థ్యం లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోందని గుర్తుచేశారు.

Nirmala Sitaraman: వికసిత్ భారత్లో భాగస్వాములు కండి
X

దిశ, బిజినెస్ బ్యూరో: వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రెంచ్ కంపెనీలు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ప్యారిస్‌లో జరిగిన భారత్-ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 'వికసిత్ భారత్ 2047' లక్ష్యానికి అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, బయోటెక్నాలజీ, డిజిటల్ హెల్త్, లైఫ్ సైన్సెస్, వ్యాక్సిన్లు, ఏపీఐ వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేసే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. అలాగే పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, ఆఫ్‌షోర్ విండ్, స్మార్ట్ గ్రిడ్‌లు వంటి రంగాల్లో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర విద్యుత్ సామర్థ్యం లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోందని గుర్తుచేశారు.

భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక వాణిజ్యం గత పదేళ్లలో రెట్టింపు అయిందని, ఇప్పుడు ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), సుస్థిర ఆర్థిక సేవలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాల్సిన సమయం వచ్చిందని సీతారామన్ అన్నారు. గిఫ్ట్ సిటీ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని, ఎన్ఐఐఎఫ్ ద్వారా మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో భారీ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఓఎన్‌డీసీ, ఇండియా స్టాక్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్రపంచ రియల్‌టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దాదాపు సగం వాటాను నమోదు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో దాదాపు 1,000 ఫ్రెంచ్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, సమావేశంలో పాల్గొన్న ఫ్రెంచ్ పరిశ్రమ ప్రతినిధులు భారత్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడిందని, దీర్ఘకాలిక పెట్టుబడులను మరింత విస్తరించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.

Next Story