- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.9,300 కోట్లకుపైగా అన్‌క్లెయిమ్డ్ నిధులు
చందాదారులు ఎలాంటి లావాదేవీలు జరపకుండా వదిలేసిన ఈ అకౌంట్లలో ఏకంగా రూ. 9,330 కోట్లకు పైగా నిధులు మూలనపడి ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం సరికొత్త ‘ఈపీఎఫ్ స్కీమ్- 2026’ని అమలులోకి తెచ్చి ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలను డిజిటలైజ్ చేసినప్పటికీ, క్లెయిమ్ కాని పీఎఫ్ సొమ్ము సమస్య మాత్రం దేశాన్ని ఇంకా వేధిస్తూనే ఉంది. ‘ఇండియా టుడే’ సేకరించిన ప్రత్యేక ఆర్టీఐ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 30.91 లక్షల ఇన్‌యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. చందాదారులు ఎలాంటి లావాదేవీలు జరపకుండా వదిలేసిన ఈ అకౌంట్లలో ఏకంగా రూ. 9,330 కోట్లకు పైగా నిధులు మూలనపడి ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో (మార్చి 2025 నాటి రూ. 10,181 కోట్లు) పోలిస్తే ఈ ఇన్‌యాక్టివ్ ఖాతాల సంఖ్య 92,000, నిలిచిపోయిన సొమ్ము రూ. 851 కోట్లు తగ్గినప్పటికీ.. దాదాపు 31 లక్షల అకౌంట్లలో వేల కోట్ల రూపాయల కార్మికుల పదవీ విరమణ పొదుపు నిధులు ఇంకా క్లెయిమ్ కాకుండా పడి ఉండటం గమనార్హం.
ఈ నిధుల పరిమాణం ఎంత పెద్దదో అర్థం కావడానికి ప్రభుత్వ వ్యయాలతో పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతాయి. ఈ సొమ్ము, కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ప్రాంతీయ విమానయాన పథకం ‘ఉడాన్’ కోసం 2016 నుంచి ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం నిధులతో (రూ. 10,169 కోట్లు) దాదాపు సమానం. అలాగే, ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి ‘ఆయుష్మాన్ భారత్’ ఉచిత వైద్య బీమా పథకం కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌కు కూడా ఇది ఇంచుమించు సరిపోతుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ లెక్కల ప్రకారం ఒక కొత్త ఐఐటీని నిర్మించడానికి సుమారు రూ. 2,934 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తే.. పీఎఫ్ ఖాతాల్లో పడి ఉన్న ఈ సొమ్ముతో ఏకంగా మూడు ఐఐటీలను నిర్మించి, ఇంకా రూ. 500 కోట్లకు పైగా మిగుల్చుకోవచ్చు.
అయితే ఈ నిష్క్రియ ఖాతాల వెనుక ఉన్న పూర్తి వివరాలను వెల్లడించడానికి ఈపీఎఫ్ఓ నిరాకరించింది. గత ఐదేళ్ల ట్రెండ్ ఎలా ఉందో చెప్పాలని కోరగా, 2025-26లోనే ప్రత్యేకంగా ‘ఇనాపరేటివ్ అకౌంట్స్ సెల్’ (ఐఏఎస్)ను ఏర్పాటు చేశామని, అందుకే గత రెండేళ్ల డేటా మాత్రమే ఉందంటూ పాత లెక్కలను దాటవేసింది. పైగా, రూ. 5 లక్షల కంటే ఎక్కువ నిల్వలున్న పెద్ద అకౌంట్ల వివరాలు తమ వద్ద విడిగా లేవని పేర్కొంది. ఇక ఏ అకౌంట్లు ఆధార్‌తో లింక్ అయ్యాయి, వేటికి ఆటో-సెటిల్‌మెంట్ సాధ్యమవుతుంది అనే కీలకమైన సమాచారాన్ని ‘విశ్వసనీయ సంబంధాల మినహాయింపు’ క్లాజ్ ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఇ) కింద చెప్పడానికి నిరాకరించింది. దీంతో డిజిటల్ సంస్కరణలు వేగంగా అమలవుతున్నప్పటికీ, కార్మికులు ఉద్యోగాలు మారిన తర్వాత లేదా ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత తమ ఈపీఎఫ్ పొదుపులను క్లెయిమ్ చేసుకునే విషయంలో ఇంకా అవగాహన, ట్రాకింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే విషయం స్పష్టమవుతోందని నిపుణులు భావిస్తున్నారు.






