- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగి ఉన్న విద్యను అందించే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

దిశ, గరిడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగి ఉన్న విద్యను అందించే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ శివారులో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నర్సింహాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి గ్లోబల్ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గడ్డిపల్లిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడ్డిపల్లి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో గర్వకారణం అన్నారు. పూర్తిస్థాయి బోర్డింగ్ హాస్టల్ తో నిర్మాణం అవుతున్న ఈ పాఠశాలలో 2500 మంది విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది జులై వరకు పాఠశాల నిర్మాణం పూర్తి చేస్తామని సంబంధిత కాంట్రాక్టర్ చెప్పగా, వచ్చే ఏడాది మే నెల చివరి వరకు పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్ ని కోరారు. ఈ పాఠశాలలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో పాటు విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈ పాఠశాల ద్వారా మెరుగైన విద్యను అందిస్తూ విద్యా ప్రమాణాలు పెంపొందించి అవకాశం కలుగుతుందన్నారు.
రహదారుల నిర్మాణంతో గ్రామాల అభివృద్ధి ..
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని నిర్మాణం పూర్తి చేసుకున్న పలు రోడ్లను ఆయన ప్రారంభించారు. మండలంలోని కల్మలచెరువులో నాలుగు కోట్ల 20 లక్షలతో కల్మలచెరువు నుంచి పాలకీడు సబ్స్టేషన్ వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. కల్మలచెరువు నుంచి గానుగబండ వరకు రెండు కోట్ల 80 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును, హనుమంతుల గూడెం పిడబ్ల్యుడి రోడ్డు నుంచి సోమల తండ వరకు 84 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును, గానుగ పంట నుంచి హనుమంతుల గూడెం వరకు మూడు కోట్ల 50 లక్షల తో నిర్మించిన బీటీ రోడ్డును, గానుగ బండ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ప రెడ్డిగూడెం వరకు కోటి 40 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు రోజుల్లో కోదాడు, హుజూర్నగర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను కలుపుతూ తారు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన తారు రోడ్లపై వ్యవసాయ పనులను కోసం ట్రాక్టర్లకు బిగించిన ఫుల్ వీల్స్, ఆఫ్ వీల్స్ తిప్పవద్దని ఆయన సూచించారు. ఇలా తిప్పడం వల్ల రోడ్లు తొందరగా పాడైపోతాయని, గ్రామీణ ప్రజలు రోడ్లను కలకాలం ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఎలినినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని తెలిపారు. రైతులు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వ్యవసాయ శాఖ వారు సూచించిన సూచనలను పాటించి వ్యవసాయం సాగులో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోదాడు డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, హుజూర్నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు, గరిడేపల్లి ఇన్చార్జ్ తాసిల్దార్ ఎన్ స్రవంతి, హుజూర్నగర్ సీఐ చరమందరాజు, గరిడేపల్లి ఎస్సై శ్రీకాంత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, మాజీ ఎంపీపీ పైడిమరి రంగనాథ్, మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, కల్మలచెరువు, గానుగుబండల సర్పంచులు బచ్చల కూడి శ్రీను, కడియాల పద్మ అప్పయ్య, ఆరే కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బచ్చలకూరి కృష్ణ, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గుండు రామాంజి,వివిధ శాఖల అధికారులతో పాటు మండలంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రస్తుత సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






