- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూతగాదాల్లో జోక్యం వద్దు.. ప్రజలకు అందుబాటులో ఉండాలి : డీజీపీ సీవీ ఆనంద్
పోలీసులు ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలని, దర్పాన్ని ప్రదర్శించడం మానేసి విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరుపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.

- నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. సాంకేతికతతో సేవలందించాలి
దిశ, తెలంగాణ బ్యూరో: పోలీసులు ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలని, దర్పాన్ని ప్రదర్శించడం మానేసి విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరుపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. ముఖ్యంగా భూవివాదాలు, సివిల్ స్వభావం గల వ్యవహారాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని, ఇలాంటి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా స్టేషన్లలో విజిటింగ్ అవర్స్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని, అధికారులు తమ క్యాంప్ ఆఫీస్ విధానాన్ని వీడి కార్యాలయాల్లోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణలో సాంకేతికత..
సీసీటీఎన్‌ఎస్ అప్‌డేషన్‌లో రాష్ట్రం ప్రస్తుతం 70 శాతం పురోగతి సాధించిందని, ఈ ప్రక్రియలో ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ముందంజలో ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన ఆధారాలను ఈ-సాక్ష్యం పోర్టల్‌లో సకాలంలో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ విషయంలో భూపాలపల్లి (55%), సిద్ధిపేట (39%) జిల్లాలు మెరుగైన ఫలితాలు సాధించాయని తెలిపారు. ఈ-సమన్ల అమలులో కామారెడ్డి (92.86%), వనపర్తి (92%) అద్భుత పనితీరు కనబరిచాయని కొనియాడారు. హైదరాబాద్‌లోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో 70 శాతానికి పైగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయని, వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులకు ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలన
పోలీసు అధికారులు సామాజిక బాధ్యతతో పనిచేయాలని విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలను బలోపేతం చేయాలన్నారు. ఈగల్ విభాగం ద్వారా ఇప్పటివరకు 825 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించామని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతం కావడం వల్ల రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవల స్పందనను మరింత వేగవంతం చేసేందుకు త్వరలోనే 112 సర్వీసులను డ్రోన్ టెక్నాలజీతో అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లపై నిరంతరం నిఘా ఉంచాలని, తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు.
విధి నిర్వహణలో ప్రతిభ
డయల్ 100 కాల్‌కు వేగంగా స్పందించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయిన వ్యక్తి ప్రాణాలను కాపాడిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఎస్‌ఐ అన్వర్ బేగంను ప్రశంసించారు. గచ్చిబౌలిలో నేపాలీ దొంగల ముఠాను పట్టుకున్న అధికారి నరేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన సీఐ రమాకాంత్, దర్యాప్తు అధికారులు నవీన్ కుమార్, శ్రీనివాసులను అభినందించారు. అలాగే మెదక్ జిల్లా శివంపేట హత్య కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా శ్రమించిన సీఐ శ్రీధర్, వెంకటరాజ గౌడ్, నల్గొండలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ధైర్యసాహసాలతో పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ విష్ణు, కానిస్టేబుల్ శ్రీకాంత్‌లకు డీజీపీ కార్యాలయంలో రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ డీజీ, సీఐడీ డీజీ, టెక్నికల్ సర్వీసెస్ డీజీ శ్రీనివాసరావుతో పాటు రాష్ట్రవ్యాప్త పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






