- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం
ఎన్పీడీసీఎల్ పరిధిలోని రైతులు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు.

దిశ, లింగంపేట : ఎన్పీడీసీఎల్ పరిధిలోని రైతులు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం లింగంపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏబీ స్విచ్‌లు, 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త లైన్ల ఏర్పాటుకు విద్యుత్ స్తంభాలు అవసరమని అధికారులు తెలియజేయగా, వాటి మంజూరుకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సామగ్రిని విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్‌ఈ సాల్య నాయక్‌ను ఆదేశించారు. లింగంపేట మండలంలోని మేంగారం, బోనాల్ గ్రామాల్లో విద్యుత్ అంతరాయాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక విలేకరులు దృష్టికి తీసుకురాగా, రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని జిల్లా ఎస్‌ఈని ఆదేశించారు.
సిబ్బంది సేవలను అభినందించిన సీఎండీ..
గత ఏడాది భారీ వర్షాలు, వరదల కారణంగా కామారెడ్డి జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగినప్పటికీ, ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి 24 గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని కొనియాడారు. ఈ సందర్భంగా కామారెడ్డి డీఈఈ నందకుమార్, ఎల్లారెడ్డి డీఈఈ విజయసారథి, లింగంపేట ఏడీఈ చీకోటి మల్లేశం, టెక్నికల్ డీఈఈ శ్రీనివాస్ గౌడ్, డీఈఈ (ఎంఆర్టీ) కళ్యాణ్ చక్రవర్తి, ఏఈఈలు, సబ్ ఇంజినీర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి..
కామారెడ్డి జిల్లాలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విట్టల్ రెడ్డి సీఎండీ వరుణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు డీడీలు చెల్లించినప్పటికీ, కొందరు కాంట్రాక్టర్లు సకాలంలో అమర్చడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని సీఎండీ హామీ ఇచ్చారు.






