- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ చంద్రలోక్ కాంప్లెక్స్‌లో భద్రత సున్నా
సికింద్రాబాద్‌లోని చంద్రలోక్ కాంప్లెక్స్ లో అగ్నిమాపక భద్రత గాలికొదిలేశారని అధికారులు తేల్చారు. ఇక్కడ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, భవనం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్‌లోని చంద్రలోక్ కాంప్లెక్స్ లో అగ్నిమాపక భద్రత గాలికొదిలేశారని అధికారులు తేల్చారు. ఇక్కడ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, భవనం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు.. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీదాస్ నేతృత్వంలో శుక్రవారం ఈ కాంప్లెక్స్‌లో అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు.
గత ప్రమాదాల నేపథ్యంలో తనిఖీలు ...
సికింద్రాబాద్‌లోని పలు వాణిజ్య భవనాల్లో గతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాలు, వాటి వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల చేదు అనుభవాల నేపథ్యంలో.. అగ్నిమాపక శాఖ నగరంలోని పాత భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే చంద్రలోక్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన తనిఖీలపై అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. భవనం నుంచి పెచ్చులు ఊడి కింద పడుతున్నాయని, ఏ నిమిషంలోనైనా ఏదైనా ప్రమాదం జరగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులకు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. అలాగే భవనంలోని విద్యుత్ వైరింగ్ కూడా పూర్తిగా పాతబడిపోయి, ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, విద్యుత్ శాఖను సైతం అప్రమత్తం చేస్తామని ఆయన వెల్లడించారు.
సహాయక చర్యలకు ఆస్కారం లేదు..
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు సురక్షితంగా బయటకు రావడానికి అవసరమైన వెడల్పు గల మెట్లు కూడా ఈ భవనంలో లేవు. పైగా భవనం చుట్టూ ఉండాల్సిన సెట్‌బ్యాక్ స్థలాన్ని కూడా ఆక్రమించడంతో, అత్యవసర సమయంలో అగ్నిమాపక వాహనం లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగితే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడం అసాధ్యమని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ పేర్కొన్నారు.
గడువులోగా మార్చకపోతే కఠిన చర్యలు ...
నిబంధనల ఉల్లంఘనపై భవన నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా అగ్నిమాపక లోపాలను సరిదిద్దాలని, లేనిపక్షంలో సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే భవన యజమానులపై రాజీలేని పోరాటం చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.






