- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేతుపల్లి రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
బేతుపల్లి గ్రామంలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.

దిశ, సత్తుపల్లి : బేతుపల్లి గ్రామంలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ఖచ్చితమైన భూ రికార్డులు రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రైతుకు రీ సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించి, వారి సమక్షంలోనే పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. భూముల విస్తీర్ణం, హద్దులు, యాజమాన్య వివరాలను శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేసి భూ రికార్డులను ఆధునికీకరించనున్నట్లు తెలిపారు.
రీ సర్వే కోసం గ్రామంలో పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, ప్రతి బృందంలో ఒక సర్వేయర్‌తో పాటు ఇద్దరు జీపీవోలు పనిచేస్తారని చెప్పారు. రైతు వేదికను కేంద్రంగా ఉపయోగించి అక్కడే కంప్యూటర్ వ్యవస్థ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను వెంటనే డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను కచ్చితంగా అమలు చేయాలని, గ్రామంలోని ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, కాలువలు, ప్రజా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల భూములను కోఆర్డినేట్లతో నమోదు చేసి పంచనామాలు నిర్వహించాలని సూచించారు.
ప్రతి బృందం రోజుకు 50 నుంచి 60 ఎకరాల వరకు రీ సర్వే పూర్తి చేయాలని, మొత్తం పది బృందాలు కలిసి రోజుకు 500 నుంచి 600 ఎకరాల వరకు సర్వే నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి రైతుల సమక్షంలో భూ వివరాలను నమోదు చేయాలని తెలిపారు. సర్వేతో పాటు డేటా ఎంట్రీ, డిజిటల్ మ్యాప్ తయారీ ప్రక్రియను సమాంతరంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
రీ సర్వే వల్ల ఏ రైతు భూమి విస్తీర్ణం తగ్గదని, ఈ ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయంగా, పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు అపోహలకు గురికాకుండా గ్రామ సభలు నిర్వహించి పూర్తి అవగాహన కల్పించాలని, ప్రతి రైతు అభిప్రాయాలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి వివాదాలకు తావులేకుండా రీ సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఈ పరిశీలనలో సత్తుపల్లి తహసీల్దార్, తిరుమలాయపాలెం తహసీల్దార్ విల్సన్, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






