30 ఏళ్లుగా ఇక్కడి ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Ratna Kumari |

1994 నుంచి ఈ ప్రాంత ప్రజలతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, తనను, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని కాగిత రామచంద్రపురం గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

30 ఏళ్లుగా ఇక్కడి ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, నడిగూడెం : 1994 నుంచి ఈ ప్రాంత ప్రజలతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, తనను, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని కాగిత రామచంద్రపురం గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రపురంలో రూ.20 కోట్ల వ్యయంతో బరాఖత్‌గూడెం నుంచి మందడి నరసయ్యగూడెం వరకు నిర్మించిన 9.5 కిలోమీటర్ల డబుల్ రోడ్డును ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తాము ఎన్నికైన మూడు నెలల్లోనే ఈ రహదారి నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు ప్రజల ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

వ్యవసాయ పరిస్థితులపై స్పందించిన మంత్రి, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలను ప్రస్తావించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గ్రామ సర్పంచ్ చక్రాల ఉమా–పిచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క బిక్షపతి, మాజీ అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ లావూరి మంగ, ఎంపీడీవో మల్సూర్ నాయక్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, నడిగూడెం ఎస్‌ఐ అజయ్ కుమార్, ఆర్‌ఐ గోపాలకృష్ణ, ఆర్‌అండ్‌బీ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story