పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం: కలెక్టర్

by Kodari Anjali |

వినూత్న డిజైన్లతో నాణ్యమైన వస్త్రాల తయారీ ద్వారా అధిక లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.

పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం: కలెక్టర్
X

దిశ, హన్మకొండ కలెక్టరెట్: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, మౌలిక వసతులు, అవకాశాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శుక్రవారం కాజీపేట మండలం మడికొండ ఇండస్ట్రియల్ పార్కులోని కాకతీయ టెక్స్టైల్ మరియు వివర్స్ వెల్ఫేర్ పొదుపు పరపతి పరస్పర సహాయక సంఘం, గ్రానైట్ పరిశ్రమలు, ఐటీ సెజ్‌ను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా వివిధ పరిశ్రమలను నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సబ్సిడీలపై విస్తృత అవగాహన కల్పించాలి..

ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లో ఇంకా ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న యూనిట్లను లీజు విధానంలో కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక పథకాలు, రాయితీలు, సబ్సిడీలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా టైలరింగ్, టెక్స్టైల్ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని యూనిట్లు ఏర్పాటు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.టెక్స్టైల్ పార్కులోని పట్టు దారపు తయారీ కేంద్రాన్ని, వివిధ వస్త్ర తయారీ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ తయారవుతున్న వస్త్రాలు, చీరల నాణ్యతను పరిశీలించి మార్కెటింగ్ విధానం, విక్రయ అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చించారు.

గ్రానైట్ పరిశ్రమను పరిశీలించిన కలెక్టర్

మడికొండ ఇండస్ట్రియల్ పార్కులోని గ్రానైట్ పరిశ్రమను జిల్లా కలెక్టర్ సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. గృహ నిర్మాణ రంగంలో గ్రానైట్, మార్బుల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం అభినందనీయమని పారిశ్రామికవేత్తలను ప్రశంసించారు.

ఐటీ సెజ్‌ను సందర్శించిన కలెక్టర్

అనంతరం ఐటీ సెజ్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న యువత, ఉపాధి అవకాశాలు, నిర్వహణ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు మరింత ఉపాధి కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి నాయక్, కాజీపేట తహసీల్దార్ రాజు, పలువురు పారిశ్రామికవేత్తలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story