నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్

by Taduka Kalyani |   (  Updated:2026-07-02 10:17:32  IST  )

నకిలీ పోలీసులుగా నటిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఛేదించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ తెలిపారు.

నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్
X

దిశ, సత్తుపల్లి: నకిలీ పోలీసులుగా నటిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఛేదించినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ తెలిపారు. గురువారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 25న కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి టౌన్ సీఐ టి. శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉండగా, 12 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. దర్యాప్తులో ఏలూరు జిల్లా వెంకటాపురానికి చెందిన ఈద చంటి బాబు ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు. అతడు మరో 13 మందితో కలిసి సిమ్ కార్డులు ఉపయోగించి వివిధ వ్యక్తులకు ఫోన్ చేసి తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవాలని ఉందని నమ్మించేవారని చెప్పారు. బాధితుల నుంచి రూ.10 లక్షలు తీసుకుని వారి ఖాతాలో రూ.40 లక్షలు జమ చేస్తామని ఆశ చూపించి, డబ్బు తీసుకునే సమయంలో పిల్లల ఆట నోట్లతో నింపిన బ్యాగును ఇచ్చేవారని వెల్లడించారు.

రూ.17.60 లక్షల నగదు, రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు స్వాధీనం

ఆ తర్వాత ముఠాలోని కొందరు నిజమైన పోలీసులు, మరికొందరు నకిలీ పోలీసుల వేషంలో అక్కడికి చేరుకుని, నకిలీ కరెన్సీ వ్యాపారం చేస్తున్నారని బెదిరించి బాధితుల వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని పరారయ్యేవారని వివరించారు. ముందస్తు ప్రణాళికతో ఈ విధంగా పలు ప్రాంతాల్లో డకాయితీలు, మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో సత్తుపల్లి మండలం బీ. గంగారం 15వ బెటాలియన్ కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, ఆర్‌ఎస్‌ఐ బైరా కేశవరావు ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు, రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్టు చేసి కేసును పూర్తిస్థాయిలో ఛేదిస్తామని తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందించారు. ప్రజలు అపరిచితుల నుంచి వచ్చే ఫేక్ కాల్స్, బ్లాక్ మనీ మార్పిడి పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఏసీపీ వసుంధర యాదవ్ సూచించారు.

Next Story