అయ్యో తల్లీ..! అమ్మ లేదని తెలియక తల్లి వద్దే అల్లరి చేసిన పిల్ల వానరం

by Ratna Kumari |

తల్లి వానరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆ విషయం తెలియని పిల్ల వానరం తల్లి చుట్టూనే తిరుగుతూ, ఆమెపైకి ఎక్కి అల్లరి చేయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

అయ్యో తల్లీ..! అమ్మ లేదని తెలియక తల్లి వద్దే అల్లరి చేసిన పిల్ల వానరం
X

దిశ, తంగళ్లపల్లి : తల్లి వానరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆ విషయం తెలియని పిల్ల వానరం తల్లి చుట్టూనే తిరుగుతూ, ఆమెపైకి ఎక్కి అల్లరి చేయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదంలో ఓ వానరం తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఘటనను గమనించిన స్థానికులు మృతిచెందిన వానరాన్ని రోడ్డు పక్కకు తరలించారు. అయితే తల్లి మరణించిన విషయం తెలియని చిన్నారి వానరం, ఆమె వద్దకు చేరుకుని ఒడిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ, ఆమెపైకి ఎక్కి దిగుతూ, అటూ ఇటూ ఆడుకుంటూ కనిపించింది. తల్లి ఇక తిరిగి రాదనే విషయం తెలియక అమాయకంగా ప్రవర్తించిన ఆ పిల్ల వానరం దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసిన స్థానికులు "అయ్యో తల్లీ..." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి–బిడ్డల అనుబంధానికి ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచింది.

Next Story