"తకైచి.. నా చోటీ బహెన్".. జపాన్ ప్రధానిని కొనియాడిన ప్రధాని మోడీ

by Muthe.Rajitha |

ఇండో-జపాన్ సమ్మిట్ లో జపాన్ ప్రధాని సనే తకైచిని తన చిన్న సోదరితో పోల్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.

తకైచి.. నా చోటీ బహెన్.. జపాన్ ప్రధానిని కొనియాడిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఇండో-జపాన్ సమ్మిట్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ సమావేశంలో జపాన్ ప్రధాని సనే తకైచిని తన చిన్న సోదరితో పోల్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన 16వ భారత్-జపాన్ వార్షిక సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా, జపాన్ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానమంత్రిగా సరికొత్త రికార్డు సృష్టించిన సనే తకైచి (Sanae Takaichi) భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడీ తకైచి పట్ల ఆత్మీయత కనబరచడం ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక, వ్యూహాత్మక బంధాలకు బాటలు వేసింది. సమ్మిట్ ప్రారంభంలో ప్రధాని మోడీ ఆమెను "మై చోటీ బెహన్" అని సంబోధించడంతో తకైచి మోహంలో నవ్వులు విరిశాయి. ఇక ఈ సమ్మిట్ కేవలం మాటలకే పరిమితం కాకుండా, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలకు వేదికగా నిలిచింది. డిఫెన్స్ కో-డెవలప్‌మెంట్ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు మధ్య ఇప్పటివరకు కేవలం సైనిక విన్యాసాలు, రక్షణ సామగ్రి కొనుగోళ్లకే పరిమితం కాగా ఇప్పుడు అత్యాధునిక రక్షణ సాంకేతికతను కలిసి తయారుచేసుకునే ఈ ఒప్పందం రక్షణరంగంలో మైలురాయిగా నిలిచిపోనుంది.

దీనితో పాటు గ్లోబల్ సప్లై చైన్ స్థిరత్వం కోసం ఆర్థిక భద్రత, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల పెంపుపై ఇరు దేశాలు అత్యంత కీలకమైన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న ఏకపక్ష చైనా వ్యూహాత్మక కదలికలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి ఈ చర్చలు ఎంతో దోహదపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా క్వాడ్ (QUAD) కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న భారత్, జపాన్‌లు 'ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్' సాధన కోసం కట్టుబడి ఉన్నాయని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి మరోసారి స్పష్టమైన సందేశాన్ని పంపాయి.

Next Story