అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని

by Ratna Kumari |

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 53వ డివిజన్ పరిధిలో లష్కర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 53వ డివిజన్ పరిధిలో లష్కర్ సింగారం, గోపాల్పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించేవారని, ప్రస్తుతం ఒక్కో డివిజన్‌కు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకొచ్చామని వెల్లడించారు. ప్రజలకు సేవలు అందించడంలో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. పేదల సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అభివృద్ధిపై తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, అయితే ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి కేంద్రానికి భూమి అప్పగించినప్పటికీ, విమానాశ్రయ అభివృద్ధిలో కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేసే ముందు తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, అభివృద్ధి చేసిన వారిని ప్రజలే గుర్తిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్ర మహేందర్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story