- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్‌పోర్ట్ భూములపై రగడ..!
ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్, పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ వాటి చుట్టూ రాజకీయ వాతావరణం మాత్రం రోజురోజుకూ వేడెక్కుతోంది.

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్, పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ వాటి చుట్టూ రాజకీయ వాతావరణం మాత్రం రోజురోజుకూ వేడెక్కుతోంది. జిల్లాకు పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు తీసుకొచ్చే ప్రాజెక్టులుగా భావిస్తున్న ఈ ప్రతిపాదనల కంటే ప్రస్తుతం భూముల వ్యవహారమే ప్రధాన చర్చగా మారింది. భూముల కొనుగోళ్లు, భూ లావాదేవీలు, భవిష్యత్ పరిణామాలు, భూముల విలువల పెరుగుదల వంటి అంశాలపై రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.దీంతో అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరగాల్సిన సమయంలో భూముల అంశమే రాజకీయంగా కేంద్రబిందువుగా మారింది. మరోవైపు అసలు వాస్తవాలు ఏమిటి..? ప్రభుత్వం ఏం చేయబోతోంది..? అనే అంశాలపై రైతులు,స్థానిక ప్రజలు అధికారిక స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.
భూముల చుట్టూ రాజకీయ వేడి..
ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఉన్న పాత ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌స్ట్రిప్‌కు సంబంధించిన సుమారు 360 ఎకరాల భూమి ఇప్పటికే అందుబాటులో ఉంది.ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం అదనంగా మరో 700 ఎకరాల భూమి సేకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. రన్‌వే విస్తరణ, భద్రతా ఏర్పాట్లు, పౌర విమాన టెర్మినల్ నిర్మాణం వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే భూఆవశ్యకత భవిష్యత్తులో 1,500 నుంచి 1,860 ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్,కారిడార్ ప్రాజెక్టుల నేపథ్యంలో భూముల అంశం రాజకీయంగా మారడంతో జిల్లాలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి కంటే భూముల వ్యవహారమే ఇప్పుడు ప్రధాన చర్చగా మారడం గమనార్హం.
సందిగ్ధంలో రైతులు..
ఎయిర్ పోర్ట్ భూముల అంశంతో ఎక్కువగా చర్చకు వచ్చిన ప్రాంతాల్లో అనుకుంట, కచ్‌కంటి, అంకోలి, లాండసంగి, తంతోలి గ్రామాల పేర్లు వినిపిస్తున్నాయి.అయితే వీటిపై తుది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మరో వైపు ప్రతిపాదిత పారిశ్రామిక కారిడార్,పరిశ్రమల క్లస్టర్ కోసం భీంపూర్,బోరజ్ మండలాల పరిసరాల్లో సుమారు 10 వేల ఎకరాల భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్న సమాచారం కూడా చర్చనీయాంశంగా మారింది.దీంతో తమ భూములు ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయా..? వస్తే ఎంత పరిహారం లభిస్తుంది..? భూ సేకరణ ఎప్పుడు ప్రారంభమవుతుంది..? అనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి.కాగా దీనిపై పుకార్లు,ఊహాగానాల కంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని రైతులు కోరుతున్నారు.
స్పష్టత ఇస్తేనే అపోహలకు తెర..
ㅤఎయిర్‌పోర్ట్, పారిశ్రామిక కారిడార్ వంటి ప్రాజెక్టులు జిల్లాకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావచ్చని పలువురు భావిస్తున్నారు.అయితే ప్రాజెక్టుల పరిధి, భూ సేకరణ విధానం, పరిహారం చెల్లింపు ప్రక్రియ, ప్రభావిత గ్రామాల వివరాలపై అధికారిక స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే గ్రామాలు, అవసరమయ్యే భూమి విస్తీర్ణం, భూ సేకరణ విధానం,భవిష్యత్ కార్యాచరణపై ముందుగానే స్పష్టత ఇస్తే అపోహలకు తెరపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.అభివృద్ధి ప్రాజెక్టులు రాజకీయ వివాదాలకు కేంద్రంగా కాకుండా జిల్లా పురోగతికి దోహదపడేలా చర్యలు ఉండాలని ప్రజలు కోరుతున్నారు.






