టీచర్లకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం అభ్యంతరకరం : ఎస్‌టీయూటీఎస్

by Muthe.Rajitha |

ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులకు కూడా అమలు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల STUTS తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

టీచర్లకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం అభ్యంతరకరం : ఎస్‌టీయూటీఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులకు కూడా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం ప్రధాన ఉద్దేశ్యం పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించి వారి ఆరోగ్యం, హాజరు శాతం, విద్యాభివృద్ధిని మెరుగుపరచడం కోసం కాబట్టి ప్రభుత్వం తన దృష్టిని పూర్తిగా విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను మరింత మెరుగుపరచడంపైనే కేంద్రీకరించాలని తెలిపింది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న ఏజెన్సీలకు గౌరవ వేతనం పెంచడంతో పాటు బిల్లులను సకాలంలో చెల్లించాలి. విద్యార్థులకు అందించే గుడ్డు ధరను ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఇప్పటికే ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించడం, వంటలను రుచి చూసి ధృవీకరించడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అదేవిధంగా, ఈ నిర్ణయం వల్ల సమాజంలో ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉందని, ప్రజల్లో చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందని ఎస్టీయూటియస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్టీయూ టియస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.

Next Story