ట్రాఫిక్ పోలీసులకు మెగా వైద్య శిబిరం

by Ratna Kumari |

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, మల్కాజిగిరి ట్రాఫిక్-1 డీసీపీ కె.రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గురువారం తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ట్రాఫిక్ పోలీసులకు మెగా వైద్య శిబిరం
X

దిశ, తిరుమలగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, మల్కాజిగిరి ట్రాఫిక్-1 డీసీపీ కె.రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గురువారం తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ ఎసిపి జి. శంకర్ రాజు మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎండ, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గంటల తరబడి రహదారులపై విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు. అలాంటి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల విధులు శారీరక శ్రమతో కూడుకున్నవని, ఆరోగ్యంగా ఉంటేనే విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని అన్నారు. ప్రతి పోలీసు ఉద్యోగి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈ వైద్య శిబిరంలో స్వచ్ఛందంగా సేవలందించిన శ్రీకర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ భవాని, దమ్మాయిగూడ పద్మసాయి డెంటల్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ దినేష్, డాక్టర్ శ్రేయ, ఈసీఐఎల్‌లోని రెటినోవా ఫౌండేషన్–ప్లానెట్ ఆప్టిక్స్‌కు చెందిన కె. భరత్ కుమార్‌లను ఎసిపి శంకర్ రాజు ఘనంగా సన్మానించారు. ఈ మెగా వైద్య శిబిరంలో ట్రాఫిక్ పోలీసులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు.

Next Story