జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియా పర్యటన వాయిదా

by  |
జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియా పర్యటన వాయిదా
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి తీవ్రతకు మరో క్రికెట్ సిరీస్ వాయిదా పడింది. ఆగస్టులో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. కాగా, గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో సిరీస్ నిర్వహించడం కష్టమని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పర్యటనను వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9న తొలి వన్డే, 12న రెండో వన్డే, 15న మూడో వన్డే జరగాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియాలో ఇప్పటికే 7,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 104మంది మృతిచెందారు. దీంతో జింబాబ్వే క్రికెట్ బోర్డుతో మాట్లాడి పరస్పర అంగీకారంతోనే ఈ వన్డే సిరీస్‌ని వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత ఏడేళ్లుగా జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించలేదు. ఇప్పుడు కరోనా కారణంగా కీలకమైన సిరీస్ రద్దు కావడం జింబాబ్వే క్రికెట్‌కు భారీ నష్టమనే భావించాలి. కాగా, పరిస్థితులన్నీ అదుపులోనికి వచ్చిన తర్వాత సిరీస్ నిర్వహిద్దామని జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ఆస్ట్రేలియా హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

Next Story