కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక

by Sridhar Babu |
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక
X

దిశ,పటాన్ చెరు : కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకని, కార్యకర్తల కృషితో మెదక్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకోబోతున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గస్థాయి కృతజ్ఞత సభ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విజయం

కోసం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. భారీ మెజారిటీతో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సూచించారు. గత పదేళ్లలో ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట వేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనన్ని పనులు పటాన్ చెరు నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓటును అడగాలని కోరారు. దొంగ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలో మీన మేషాలు లెక్కిస్తూ రైతులకు అన్యాయం చేస్తుందని

దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పండ్ల కోసం మంజూరైన 400 కోట్ల రూపాయల నిధులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలు పనికి రావని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీలు దేవానందం,‌ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ రెడ్డి, పుష్పా నగేష్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సోమిరెడ్డి, దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story