భారత్ నుంచి మారిషస్‌‌కు బియ్యం, ఖతార్‌కు ఉల్లి ఎగుమతి

by Harish |
భారత్ నుంచి మారిషస్‌‌కు బియ్యం, ఖతార్‌కు ఉల్లి ఎగుమతి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని సడలించడంతో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలకు బియ్యం, ఉల్లిపాయలను అందించడానికి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి మారిషస్‌‌కు 14,000 టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని, ఖతార్‌కు 7,500 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లినట్టు సమాచారం.

మారిషస్‌కు 24,000 టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని, రాబోయే రెండు నెలల్లో ఖతార్‌కు 15,000 టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయాలని సిఫార్సు చేసినప్పటికీ, 14,000 టన్నుల బియ్యాన్ని మారిషస్‌కు ఎగుమతి చేయాలని కమిటీ నిర్ణయించింది. అయితే, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్(NCEL) ద్వారా చివరి నిర్ణయాన్ని ఉన్నత అధికారులు తీసుకుంటారని ఒక అధికారి తెలిపారు.

దేశంలో బియ్యం, ఉల్లి ధరలు అదుపులో ఉంచడానికి, ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా అందించడానికి వాటి ఎగుమతులపై నిషేధం విధించారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు దీనిని ఎత్తివేసింది. బియ్యంపై నిషేధం ఉన్న కాలంలో భారత్ 2024 ఏప్రిల్ నుండి మే మధ్యకాలంలో 1.75 మిలియన్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఎగుమతి చేయగలిగింది, గత ఏడాది ఇదే కాలంలో 2.35 మిలియన్ టన్నులుగా ఉంది. ఇక ఉల్లి విషయానికి వస్తే, 99,150 టన్నులను ఆరు పొరుగు దేశాలకు, బంగ్లాదేశ్, UAE, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, శ్రీలంకలకు ఎగుమతి సంస్థ NCEL ద్వారా అందించింది.



Next Story

Most Viewed