కరోనా వ్యాక్సిన్: కోటా ఎక్కువ.. పంపిణీ తక్కువ

by  |
corona vaccine stock
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టీకాల కొరత కొనసాగుతున్న తరుణంలో ప్రైవేటు హాస్పిటళ్లలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. గత నెల అందుబాటులో ఉన్న టీకాల్లో కేవలం 17శాతం మాత్రమే అవి పంపిణీ చేశాయి. మిగతా స్టాక్ అంతా నిరుపయోగంగానే ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ ప్రకటనల ద్వారానే ఈ విషయం బోదపడుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నెల 4న విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం, మే నెలలో దేశంలో 7.4 కోట్ల టీకాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. ఇందులో 25శాతం అంటే 1.85 కోట్లు ప్రైవేటు హాస్పిటళ్లకు కేటాయించినవని వివరించింది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు హాస్పిటళ్లు.. కేటాయించిన 1.85 కోట్ల డోసుల్లో నుంచి 1.29 కోట్ల డోసులను కొనుగోలు చేశాయి. ప్రభుత్వ ప్రకటనలోనే మరో విషయమూ వెలుగులోకి వచ్చింది. మే నెలలో ప్రైవేటు హాస్పిటళ్లు కేవలం 22 లక్షల డోసులను మాత్రమే వినియోగించాయని తెలిసింది. ప్రభుత్వ కేంద్రాల్లో కంటే ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఖరీదవడం, టీకాలపై అపనమ్మకాల వంటి కారణాలతో ప్రైవేటు హాస్పిటళ్లలో వ్యాక్సిన్లు తీసుకోవడం ప్రజలు ముందుకు రావడం లేదనీ కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రైవేటు హాస్పిటళ్లలో కేటాయింపులకంటే చాలా తక్కువగా పంపిణీ జరుగుతున్నాయన్న వాదనలను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కొట్టిపారేయడం గమనార్హం. 25శాతం టీకా డోసులను ప్రైవేటుకు కేటాయిస్తే, మొత్తం టీకా పంపిణీలో వీరు చేసినవి కేవలం 7.5శాతంగానే ఉన్నాయన్న కొన్ని మీడయా సంస్థల కథనాలను కేంద్రం తప్పుపట్టింది. ప్రైవేటు హాస్పిటళ్లు టీకా పంపిణీ ద్వారా సొమ్ముజేసుకుంటున్నాయని ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం గరిష్ట ధరను నిర్ణయించింది. కొవిషీల్డ్ సింగిల్ డోసు పంపిణీకి సర్వీసు చార్జీ సహా రూ. 780, కొవాగ్జిన్‌కు రూ. 1,410, స్పుత్నిక్ వీ టీకాకు రూ. 1,145 మించకుండా ధరలు నిర్ణయించుకోవాలని ఆదేశించింది.

Next Story