రైతుల సభ క్యాపిటల్ కోసం కాదు.. క్యాపిటలిస్టుల కోసమే: ఎమ్మెల్యే రోజా 

by  |
రైతుల సభ క్యాపిటల్ కోసం కాదు.. క్యాపిటలిస్టుల కోసమే: ఎమ్మెల్యే రోజా 
X

దిశ, ఏపీ బ్యూరో : తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభపై నగరి ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన సభ క్యాపిటల్ కోసం కాదని క్యాపిటలిస్టుల కోసమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించుకున్న సభ అని చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలబడిన నేతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే… ఇతర పార్టీల నేతలు కేవలం అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు బాగుండాలని కోరుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని బాగు చేసేందుకు పరితపిస్తుంటే, నాశనం చేసేవాళ్లంతా ఒకే వేదికపై చేరారంటూ సెటైర్లు వేశారు. అమరావతి రైతుల సభలో పాల్గొన్న చంద్రబాబు సహా ఇతర పార్టీల నాయకులు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని… వారంతా తీరని ద్రోహం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 29 గ్రామాల గురించే మాట్లాడుతున్నారే తప్ప 13 జిల్లాల గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు.

కర్నూలుకు రెండో రాజధాని, హైకోర్టు కావాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు సైతం చంద్రబాబు పక్కన కూర్చొని అమరావతికి మద్దతు పలకడం అంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదన్నారు. రాయలసీమకు అన్యాయం చేసే వారిలో చంద్రబాబు, సీపీఐ నారాయణలు ముందు వరుసలో ఉన్నారని, వారిని ప్రజలు నిలదీయాలని రోజా పిలుపునిచ్చారు. మరోవైపు ఇంతకాలం ముసుగు వేసుకున్న దొంగలు ఇప్పుడు జగన్ పై విషం కక్కుతున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు జగన్‌పై ఎంతమంది విషం కక్కినా ఎవరూ ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతంలో భూముల రేట్లను పెంచుకోవడం లక్ష్యంగా అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.

Next Story