AP NEWS : వాలంటీర్ల అవార్డులపై వర్ల రామయ్య సంచలన కామెంట్స్

by Vinod kumar |
AP NEWS : వాలంటీర్ల అవార్డులపై వర్ల రామయ్య సంచలన కామెంట్స్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో 2,33,333 మంది వలంటీర్లకు సేవాసత్కారాల కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రూ. 239.22 కోట్లు ఖర్చు చేయడం దురదృష్టకరం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. వలంటీర్లు సమాజానికి వారు ఎనలేని సేవలు చేశారని, అందుకే వారిని సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నట్లు ఓ పత్రికలో చూసినట్లు వర్ల రామయ్య తెలిపారు. 'సేవచేసిన వారిని సత్కరించాలని భావిస్తే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న రెవెన్యూ యంత్రాంగాన్ని సన్మానించాలి. సెలవులు కూడా లేకుండా నిరంతరం ప్రజల మాన, ప్రాణాలను రక్షిస్తున్న పోలీసు యంత్రాంగాన్ని సత్కరించాలి. ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోయినా మారుమూల పల్లెల్లో సైతం సేవలందిస్తున్న వైద్యాధికారులు, వైద్య సిబ్బందిని సన్మానించాలి.

రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా సేవలందిస్తున్న 7 లక్షల మంది ఉద్యోగ సోదరులను సత్కరించాలి. అంతే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడానికి సహకరించిన సొంత పార్టీ కార్యకర్తలైన వలంటీర్లకు వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి సన్మానాలు చేయడం సిగ్గుచేటు' అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ అడ్డగోలు దోపిడీకి సహకరిస్తున్నందుకు సత్కరిస్తున్నారా? ప్రజలపై మోపిన అడ్డగోలు భారాలను ముక్కుపిండి వసూలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వారిని సన్మానిస్తున్నారా? అక్రమ మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తూ తాడేపల్లి ప్యాలెస్ టార్గెట్‌ను అధిగమిస్తున్నందుకు సత్కరిస్తున్నారా? ఏం ఘనకార్యాలు చేశారని వలంటీర్లను సత్కరిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని గతంలో వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించారు. మీకు, మీ పార్టీకి సేవలందించారని భావిస్తే తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న ఖజానా సొమ్ముతో వారికి సత్కారాలు చేయండి. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఎరగా వేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అంటూ వర్ల రామయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed