CM Revanth Reddy: అన్‌స్టాపబుల్‌ గా తెలంగాణ రైజింగ్‌ : సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-12-08 11:19:28  IST  )

గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో విజన్ డాక్యూమెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: అన్‌స్టాపబుల్‌ గా తెలంగాణ రైజింగ్‌ : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : మాహాత్మా గాంధీ, అంబేడ్కర్ ఆదర్శంగా తమ అభివృద్ధి మార్గాన్ని రూపొందించుకుంటున్నామని, దేశంలోనే యంగెస్ట్ రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు అవుతాయని, ఆ సమయానికి మనమేం సాధించగలమో చెప్పాలని నిపుణులను కోరామని ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడిందని తెలిపారు. ఆ తర్వాత అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, వారందరికీ ధన్యవాదాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు.

అపారమైన అవకాశాలు..

గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు రావడం అదృష్టంగా భావిస్తున్నామని, వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, మంచి సానుకూల వాతావరణం ఉందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని తెలిపారు. దేశంలో తెలంగాణ దాదాపు 2.9 శాతం జనాభా కలిగి ఉందని దేశ జీడీపీలో ఇక్కడి నుంచి దాదాపు 5 శాతం వాటాను అందిస్తున్నామన్నారు. 2047 నాటికి 10 శాతం వాటాను అందించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

త్రిముఖ వ్యూహం..

సమగ్ర తెలంగాణ అభివృద్ధి కోసం సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం.. ఇలా 3 భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నామని సీఎం తెలిపారు. ఇందుకోసం అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) మోడల్స్ తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి సీఎం ప్రస్తావించారు. గ్వాంగ్‌డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రావిన్స్‌కైనా అతిపెద్దదని 20 ఏళ్లలో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా తాము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నట్టు చెప్పారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి తామెంతో ప్రేరణ పొందామన్నారు. ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నామని, తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీ అందరినీ ఆహ్వానించామన్నారు. విజన్ కష్టంగా అనిపించినా సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని, మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నానని సీఎం పేర్కొన్నారు.

Read More...

పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది.. గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

TG: గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ ముందుకెళ్తోంది: భట్టి విక్రమార్క


Next Story