దిశ ఎఫెక్ట్.. కదిలిన అధికారులు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్..  కదిలిన అధికారులు
X

దిశ, నడిగూడెం : ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ 'దిశ' శనివారం ప్రచురించిన "పల్లెపాలన అస్తవ్యస్తం" అనే కథనానికి జిల్లా పంచాయతీ అధికారి జి.సురేష్ కుమార్ స్పందించారు. ఈ మేరకు మండల వ్యాప్తంగా పంచాయతీలలో సాగుతున్న ప్రత్యేకాధికారుల పాలన తీరుతెన్నులపై నివేదిక రూపంలో అందించాలని శనివారం మండల పంచాయతీ అధికారి దుర్గాప్రసాద్ ను ఆదేశించారు. గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఆయా పల్లెలను సందర్శిస్తూ క్షేత్రస్థాయిలో

జరుగుతున్న పనులను నిత్యం పర్యవేక్షించాలన్నారు. స్థానిక పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధి కుంటు పడకుండా చేయాలనేదే ప్రభుత్వ నిర్ణయమని, ఇందుకు అనుగుణంగా ప్రత్యేకాధికారులు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బృందావనపురంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ దగ్గర పేరుకు పోయిన చెత్తను స్థానిక పంచాయతీ సిబ్బందితో అధికారులు తొలగింప చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సయ్యద్ ఇమామ్, కార్యదర్శి రత్నం, సిబ్బంది పాల్గొన్నారు.

కదిలిన ప్రత్యేకాధికారులు..

'దిశ' కథనంతో గ్రామపంచాయతీల ప్రత్యేకాధికారులు కదిలారు. శనివారం వారికి కేటాయించిన గ్రామపంచాయతీల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తహసీల్దార్ హేమమాలిని రామాపురంలో పర్యటించి పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, రత్నవరంలో నిర్మిస్తున్న సైడ్ డ్రైన్ పనులను పర్యవేక్షించారు. పంచాయతీ కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సయ్యద్ ఇమామ్, ఆర్ ఐ గోపాలకృష్ణ, జీపీల కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed