డ్రాగన్ ఫ్రూట్ సాగుపై మంత్రి ప్రశంస

by Disha Web Desk 15 |
డ్రాగన్ ఫ్రూట్ సాగుపై మంత్రి ప్రశంస
X

దిశ , జహీరాబాద్ : తెలంగాణ రాష్ర్టం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ గ్రామంలో రైతు రమేష్ రెడ్డి , కుటుంబ సభ్యులు" లెడ్ లైట్ల " సహాయంతో ఆఫ్-సీజన్ లో సాగుచేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్​ రెడ్డి సందర్శించారు. స్థానిక రైతు నర్సింహారెడ్డి కుమారుడు రమేష్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ సాగు పద్ధతి మంత్రిని ఎంతగానో ఆకట్టుకుంది. ఎల్‌ఈడీ లైట్లను వినియోగించి ఆఫ్ సీజన్‌లో పంటలు పండించడంతో పాటు పండ్ల దిగుబడిని సాధించడం పట్ల మంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

డ్రాగన్ ఫ్రూట్ సాగు, అయ్యే ఖర్చులు, మార్కెటింగ్ , అధిక ఉత్పత్తికి తీసుకోవలసిన చర్యలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై మంత్రి రైతుతో ముచ్చటించి తెలుసుకున్నారు. రైతు కృషిని కొనియాడారు. మంత్రితోపాటు జిల్లా ఉద్యానవన అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. తాను సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించినందుకు స్థానిక రైతు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో డ్రాగన్ ఫ్రూట్ తోటల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రిని కోరారు.

Next Story