పరారైన రిమాండ్ ఖైదీ అరెస్ట్

by Disha Web Desk 1 |
పరారైన రిమాండ్ ఖైదీ అరెస్ట్
X

దిశ, కంది: సంగారెడ్డి జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న రిమాండ్ ఖైదీ చిద్రిక అరవింద్ (22)19న రాత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసుల కళ్లుగప్పి పరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు ఎట్టకేలకు పరారైన రిమాండ్ ఖైదీని శక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి వివరాలు ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అరవింద్ చికిత్స పొందుతుండగా బాత్ రూంకు వెళ్తానని చెప్పి కిటికీ చువ్వలను తొలగించి అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే, సదరు ఖైదీ ప్రభుత్వాసుపత్రి నుంచి పారిపోతూ సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తాళం వేసిన ఇంట్లో చోరికి పాల్పడ్డాడు. ఆ ఇంట్లో ఉన్న కొన్ని బంగారు నగలతో పాటు సెల్ ఫోన్లను కూడా ఎత్తుకెళ్లాడు. పరారైన నిందితుడి కోసం పట్టణ పోలీసులు ప్రత్యేక మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున మియాపూర్- హైదరాబాద్ బస్ స్టాప్ లో నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అతడి నుంచి దొంగలించిన బంగారు నగలతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పట్టణ సీఐ వివరించారు.

Next Story