బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టిస్తోంది.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Dishafeatures2 |
బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టిస్తోంది.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బీపీఎల్ కింద ఉన్న 54 లక్షల కుటుంబాలకు వంద రోజుల పాటు పని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉపాధి హామీ చట్టం నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చిన నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ఆదివారం గాంధీ భవన్ ప్రకాశం హాల్ లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ (కేకేసీ) సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కార్మిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేజెస్ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లుగా మినిమం వేజెస్ బోర్డ్ సమీక్ష చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. మినిమం వేజెస్ బోర్డు సమీక్ష జరపకుండా, కనీస వేతనం అమలు చేయకుండా తొమ్మిదిన్నర ఏళ్లుగా కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఔట్సోర్సింగ్ విధానంతో శ్రమ దోపిడీకి పాల్పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కార్మికులు నిలదీయాలన్నారు. కార్మికులకు సంబంధించిన రూ. 10వేల కోట్ల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మిక లోకం బుద్ధి చెప్పాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ చట్టాలు తెచ్చి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ దే అని గుర్తుచేశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకువస్తామని హమీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఫ్యూడలిస్టుల ప్రభుత్వం, దేశంలోని క్యాపిటలిస్టుల ప్రభుత్వం చేసే కుటిల, కుట్రల్లో కార్మికులు పడొద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీ ఖాన్, ఆన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్, కాంగార్ కర్మాచారి కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ ఉదిత్ రాజు, కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, కేకేసి రాష్ట్ర చైర్మన్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed