BRS ఎఫెక్ట్: కేసీఆర్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి సవాలు తప్పదా?

by GSrikanth |
BRS ఎఫెక్ట్: కేసీఆర్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి సవాలు తప్పదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అధినేత కేసీఆర్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి సవాలు తప్పదా? ఏపీతో నెలకొన్న జల వివాదాలను అడ్రస్ చేయడంలో చిక్కులేంటి? పోతిరెడ్డిపాడు, పోలవరం, సంగమేశ్వర ప్రాజెక్టులపై ఇంతకాలం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అక్కడ సానుకూల స్పందన పొందడంలో ఎదుర్కొనే ఇబ్బందులేంటి? విభజన చట్టంలోని సమస్యల పరిష్కారానికి తెలంగాణే అడ్డంకి అనే ఏపీ వాదనను వివరించడమెలా? గోదావరి-కావేరి నదుల అనుసంధానపై తమిళనాడును కన్విన్స్ చేసేదెలా? అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాపై అభ్యంతరం వ్యక్తం చేయగా ఇకపైనా కర్నాటకలో ఎలాంటి వైఖరి ప్రదర్శించాలి? కృష్ణా జలాల విషయంలో మహారాష్ట్ర ప్రజల మనసుల్ని గెలిచేదెలా?.. ఇవన్నీ ఇప్పుడు బీఆర్ఎస్‌కు సంక్లిష్టంగా మారాయి.

పాలసీ రూపకల్పన కత్తిమీద సామే

పొరుగు రాష్ట్రాలతో ఉన్న జల వివాదాలతో పాటు విభజన చట్టంలోని అంశాలపై ఏపీతో విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పేరుతో అక్కడ ప్రచారం చేసే టైమ్‌లో వీటిపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుంది. ఇంతకాలం తెలంగాణకు మాత్రమే పరిమితమైనందున టీఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా మాట్లాడడం సహేతుకమైన విధానమే అనే అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు రాష్ట్రాల పరిధి దాటి జాతీయ స్థాయిలోకి విస్తరిస్తున్నందున నేషనల్ పర్‌స్పెక్టివ్ తరహాలో స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఏక కాలంలో ఇటు తెలంగాణకు, అటు వివిధ రాష్ట్రాలకు సంతృప్తికరమైన తీరులో పాలసీని రూపొందించడం బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే ఆ దిశగా కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం.

అన్నింటినీ సంతృప్తి పర్చేలా..

వాటర్, అగ్రికల్చర్, ఇరిగేషన్ పాలసీలు అన్ని రాష్ట్రాలకూ వర్తించేలా, అన్నింటినీ సంతృప్తిపరిచేలా రూపొందించడం అనివార్యమవుతున్నది. కృష్ణా జలాల విషయంలో ఒకేసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంతృప్తికరమైన ఫార్ములాను రూపొందించడం తప్పనిసరిగా మారింది. రెండు రాష్ట్రాలకూ ఘర్షణపడే బదులు ప్రయోజనం పొందేలా వ్యవహరించడం అవసరమని గతంలో జగన్‌ను ప్రగతి భవన్ విందుకు ఆహ్వానించిన సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణను, సంగమేశ్వరం ప్రాజెక్టును, పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతంపైనా, ఏడు మండలాల విలీనంపైనా ఏపీ ప్రభుత్వంపై ఇప్పటివరకూ తెలంగాణ విమర్శలు చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలను కన్విన్స్ చేయకతప్పదు. దీనికి తోడు విభజన సమస్యల పరిష్కారంలో తెలంగాణ వైఖరి వల్లనే పెండింగ్‌లో పడిపోయినట్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ వ్యాఖ్యానించింది. దీనిపైన కూడా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించినా కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఆ హోదా ఇవ్వడాన్ని ప్రస్తావించడంతో ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పట్ల వేరే అభిప్రాయం ఏర్పడడానికి దారితీసింది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. దేశంలో 70 వేల టీఎంసీలు ఉన్నా అందులో సగం కూడా వాడుకోలేకపోతున్నామని, స్పష్టమైన వాటర్ పాలసీ రూపొందిస్తే అన్ని రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందనే అంశాలతో అక్కడి ప్రజలను కన్విన్స్ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం విషయంలోనూ ఇక్కడి జలాలను తమిళనాడుకు పంపించడం సమంజసమేనా అనే ప్రశ్నలతోనూ తెలంగాణకు చెందిన పార్టీగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

హామీలు.. ఆర్థికంగా సాధ్యమేనా!

తెలంగాణ అమలుచేస్తున్న రైతుబంధు, ఉచిత వ్యవసాయ విద్యుత్, దళితబంధు లాంటివి దేశవ్యాప్తంగా ఎందుకు అమలుచేయరంటూ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను కేసీఆర్ పలుమార్లు ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు కూడా ఆ రెండు పార్టీల నాయకులను నిలదీశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయికి విస్తరించాలనుకుంటున్నందున అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలుచేస్తామనే హామీని కేసీఆర్ ఇవ్వగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా ఇది సాధ్యమేనా?.. వనరుల సమీకరణలో ఉన్న చిక్కులేంటి?.. ఇలాంటివన్నీ ఇప్పుడు మేధావుల స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎజెండా, వివిధ రకాల పాలసీలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వాటిని లాంఛనంగా విడుదల చేసే సమయంలో క్లారిటీ రానున్నది.

Read more:

పైసల్లేక ఆగిపోయిన కీలక స్కీమ్.. కష్టాల్లో దళిత కుటుంబాలు!!

Next Story

Most Viewed