రష్యాలోని భారత్ దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ గూఢచారి: యూపీలో అరెస్టు చేసిన ఏటీఎస్

by samatah |
రష్యాలోని భారత్ దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ గూఢచారి: యూపీలో అరెస్టు చేసిన ఏటీఎస్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐకి సహకరిస్తున్నానే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఆదివారం మీరట్‌లో అరెస్టు చేసింది. ఏటీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..రష్యాలోని భారత దౌత్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హాపూర్‌లోని షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన సత్యేంద్ర సివాల్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నారు. భారత్-రష్యాలకు సంబంధించిన వ్యూహాత్మక, నిఘా సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందజేస్తున్నాడు. అంతేగాక మరింత రహస్య సమాచారాన్ని రాబట్టేందుకు దౌత్య కార్యాలయంలోని ఇతర పై అధికారులను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రష్యాలోని భారత్ ఎంబసీలో ఐఎస్ఐ ఏజెంట్ ఉన్నారని ఏటీఎస్‌కు సమాచారం అందింది. దీంతో సివాల్‌పై నిఘా పెట్టారు. అనంతరం అనుమానం రావడంతో విచారణ నిమిత్తం మీరట్‌కు పిలిచారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సరైన సమాధానాలు ఇవ్వలేదు. చివరికి గూఢచర్యానికి పాల్పడినట్టు అంగీకరించారు. ఈ క్రమంలోనే సివాల్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రెండు ఫోన్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సత్యేంద్ర 2021 నుంచి మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందజేసినట్టు ఏటీఎస్ తెలిపింది.

Next Story

Most Viewed