'ఆత్మనిర్భర్ కిసాన్' అవసరం

by  |
ఆత్మనిర్భర్ కిసాన్ అవసరం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’ అని అంటోందిగానీ నిజానికి ఇప్పుడు మనకు ‘ఆత్మనిర్భర్ కిసాన్’ అవసరం అని నాబార్డు ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతాంగం చాలా ఉత్తేజంగా ఉందని, భూమిలో తేమ పెరగడంతో పాటు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడం, వర్షాలు సంతృప్తిగా కురవడం ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు అవుతోందని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఎడిబుల్ ఆయిల్ హబ్‌గా అవతరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో నాబార్డు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆయిల్ పామ్ సాగుకు యోగ్యమైన భూములు ఉన్నాయని, ఉపాధితో పాటు రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుందని, కొంతకాలం తర్వాత ఇక్కడి నుంచి ఆయిల్ ఉత్పత్తులను కూడా ఇతర ప్రాంతాలకు అందించవచ్చన్నారు.

రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నియంత్రిత సాగు విధానం చాలా ఉపయోగకరమైనదని, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అమలుకావాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలనే పండించే విధానం దేశం మొత్తం అనుసరించాలన్నారు. దీనివల్ల ఇటు రైతులకు, అటు వినియోగదారులకు కూడా ఉపయోగమన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం నాబార్డు ద్వారా రుణాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని, రానున్న రోజుల్లో తెలంగాణ ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

Next Story