కేసీఆర్, ఓవైసీ కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు

by  |
కేసీఆర్, ఓవైసీ కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు
X

దిశ, వికారాబాద్ : రాష్ట్రంలో కేసీఆర్, ఓవైసీ కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొండ బాలకృష్ణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సీఎం కేసీఆర్ ఫాం హౌస్ వదిలి ప్రగతి‌భవన్‌కు వస్తారని విమర్శించారు.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచందర్ రావును గెలిపించాలని కోరారు. సచివాలయానికి రావడం లేదని విమర్శలు రావడంతో దాన్నే కూల్చేసిన గొప్ప సీఎం.. కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మేధావులకు సంబంధించినవని, కానీ టీఆర్ఎస్ పార్టీ వాటిని సాధారణ ఎన్నికలుగా మార్చి ఓటర్లను మభ్యపెడుతోందని విమర్శించారు. రాష్ట్రం నిరుద్యోగులకు నిలయంగా మారిందన్నారు. చట్టసభల్లో ప్రజాసమస్యలను వినిపించే నాయకుడే లేకుండా సీఎం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో బీజేపీ ఒక్కటే ప్రజల గొంతుక అయిందని గుర్తు చేశారు. 160 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే రైల్వే ఓవర్ హోల్డింగ్ పరిశ్రమ నిలిచిపోయిందన్నారు. రూ.6 వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమ తేచ్చామని దానిని త్వరలోనే పీఎం మోడీ ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రధాని మోడీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. కొందరు మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, బీజేపీ పార్లమెంట్ ఇన్‌చార్జి జనార్దన్ రెడ్డి, జిల్లా నాయకులు మాధవ‌రెడ్డి, శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed