ఆదాయం కోసమే మద్యంపై ఆంక్షలు ఎత్తేశారా?

by  |
ఆదాయం కోసమే మద్యంపై ఆంక్షలు ఎత్తేశారా?
X

మూడో విడత లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా తీసుకున్న నిర్ణయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అనుమానాలు కల్పిస్తున్నాయి. ఇన్నాళ్ల కఠిన ఆంక్షలకు తూట్లు పొడుస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం దుకాణాల తెరిపేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం కేవలం ఆదాయ సముపార్జన కోసమే తీసుకున్నట్టు పరిస్థితులు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మద్యం ధరలు పెంచాల్సి వస్తోందని చెప్పింది. అయితే ఇక్కడే ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా ఉంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణే అసలు ఉద్దేశ్యమైతే.. రెడ్ జోన్లలోని ప్రజలు గ్రీన్ జోన్లకు రాకుండా తీసుకున్న జాగ్రత్తలేంటని ప్రశ్నిస్తున్నారు.

ఒక్కసారిగా షాపుల వద్ద ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలేంటని ప్రశ్నిస్తున్నారు. వీటిపై ఏమాత్రం దృష్టిపెట్టకుండా మద్య నియంత్రణకు ధరల పెంపే మార్గమన్నట్టు ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆదాయ సముపార్జన కోసమే ధరలు పెంచి మద్యం దుకాణాలు తెరిపించిందని, ప్రజారోగ్యం, నిషేధం వంటివి సాకు మాత్రమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బొక్కసాన్ని నింపే ఏకైక మార్గం మద్యం విక్రయాలేనన్న ఆలోచనతోనే… కరోనాపై తూతూ చర్యలతో మద్యం దుకాణాలను తెరిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యంపై 25 శాతం ధరలు పెంచుతున్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ… మద్యం దుకాణాలు 30 శాతానికి పైగా పెంచినట్టు ఆరోపణలున్నాయి.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం కోసం ఎదురు చూస్తున్న మందుబాబులు ధరవరలను ఏమాత్రం లెక్కచేయకుండా కొనుగోలుచేస్తున్నారు. మరోవైపు మద్యం దుకాణాలు తెరవడంతో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు పెట్టే ఉపద్రవముందని భావిస్తున్న మందుబాబులు భారీ ఎత్తున మద్యాన్ని కోనుగోలు చేసి, భద్రపరచుకుంటున్నారన్న సమాచారం ఉంది. మరోవైపు ఇదే కారణంతో స్టాక్ ఉంచుకునేందుకు దుకాణదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

మద్యం విక్రయాల నేపథ్యంలో పెంచిన ధరను ప్రొహిబిషన్‌ టాక్స్ పేరిట కొత్త కాంపోనెంట్‌ సృష్టించి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన కరోనా కష్టకాలంలో నష్టపోయిన మద్యం ఆదాయం స్వల్ప వ్యవధిలోనే సమకూర్చుకోనుంది. అక్టోబర్ నాటికి ఎక్సైజ్ విభాగం ఆదాయం 4,406 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. అయితే ఏటా జరిగే విక్రయాల వృద్ధి కారణంగా ఈ ఏడాది 5 వేల కోట్ల రూపాయల ఆదాయం మద్యం విక్రయాల వల్లే వస్తుందన్నది నిపుణుల అంచనా.

ప్రస్తుతం మద్యం దుకాణాల వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడున్న స్టాక్ ఒకట్రెండు రోజుల్లోనే అమ్ముడైపోవడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆదాయం పెరుగనుంది. కరోనా కారణంగా మందుబాబులు ఇంట్లోనే దుకాణం పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో గృహహింస కేసులు కూడా పెరిగే ప్రమాదముందని మానవహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

tags: liquor sales, excise department, excise income, ap

Next Story