యూరిన్ సౌండ్‌ రికార్డింగ్‌కు యాప్.. వ్యాధుల నిర్ధారణకే

by Dishanational1 |
యూరిన్ సౌండ్‌ రికార్డింగ్‌కు యాప్.. వ్యాధుల నిర్ధారణకే
X

దిశ, ఫీచర్స్ : ఇప్పటి వరకు బ్లడ్, యూరిన్ టెస్ట్ లేదా ఎక్స్‌రే, స్కానింగ్స్ ద్వారా రోగాలను నిర్ధారించడం చూశాం. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అల్గారిథం ద్వారా రోగుల మూత్ర విసర్జన శబ్ధాన్ని పసిగట్టి తద్వారా అసాధారణ ప్రవాహాలు, సంబంధిత ఆరోగ్య సమస్యలను సమర్ధవంతంగా గుర్తించే సాంకేతికత పుట్టుకొచ్చింది. 'ఆడియోఫ్లో'గా పిలువడే ఈ డీప్ లెర్నింగ్ టూల్‌.. సాధారణంగా క్లినిక్స్‌లో ఉపయోగించే స్పెషలిస్ట్ మెషిన్‌కు సమానమైన ప్రదర్శన కనబరిచి ఉత్తమ ఫలితాలను అందించింది.

మూత్ర ప్రవాహ ధ్వనితో..

ఈ అల్గారిథం సౌండ్‌ప్రూఫ్ వాతావరణంలో ఉత్పత్తి చేయబడిన మూత్రం నుంచి వచ్చే శబ్దాన్ని అంచనా వేస్తుంది. ఇందుకోసం రోగులు ఇంటి వద్దే తమను తాము పర్యవేక్షించుకునేందుకు స్వయం సమృద్ధిగా ఉండే ఒక యాప్‌ను అభివృద్ధి చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో గల యూరోఫ్లోమెట్రీ మెషిన్ మూత్ర సంబంధిత పరిస్థితులను ప్రభావవంతంగా అంచనా వేయగలదు. కానీ ఔట్ పేషెంట్ సందర్శనల సమయంలో రోగులు యంత్రంలో మూత్ర విసర్జన చేయాలి.

ఇదిలా ఉంటే.. COVID-19 మహమ్మారి కారణంగా రోగులు క్లినిక్స్‌‌ను సందర్శించడం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే సింగపూర్ జనరల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ హాన్ జీ, అతని బృందం ఎటువంటి వైద్య సాయంలేకుండా ఇంట్లోనే మూత్ర సంబంధిత వ్యాధులను అంచనా వేయడానికి మరింత ప్రభావవంతమైన మార్గాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. అందువల్ల మూత్ర-అంచనా అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసేందుకు ఇంజనీరింగ్ విభాగం సాయం తీసుకున్నారు. ఈ అల్గారిథమ్‌కు శిక్షణ ఇవ్వడానికి, ధృవీకరించడానికి వారు డిసెంబర్ 2017 నుంచి జూలై 2019 మధ్య 534 మంది పురుష అభ్యర్థులను రిక్రూట్ చేసుకున్నారు. వీరంతా సౌండ్‌ప్రూఫ్ చేయబడిన గదిలో యూరోఫ్లోమెట్రీ మెషిన్‌ ఉపయోగించి, మూత్ర విసర్జనను స్మార్ట్‌ఫోన్‌తో రికార్డ్ చేశారు.

ప్రొఫెషనల్ రిజల్ట్స్‌తో మ్యాచింగ్ :

కేవలం 220 రికార్డింగ్స్ ఉపయోగించిన మీదట AI.. ప్రవాహ రేటు, పరిమాణంతో పాటు సమయాన్ని కచ్చితంగా అంచనా వేయడం నేర్చుకుంది. ఇవన్నీ కలిసి బ్లాడర్‌లోని అడ్డంకిని లేదా సమస్యలను సూచిస్తాయి. ఇక ఈ Audioflow అనేది సంప్రదాయ యూరోఫ్లోమెట్రీ మెషిన్, ఆరుగురు యూరాలజీ రెసిడెంట్స్‌తో పోటీపడేలా ఫలితాలను అందించింది. ఈ కొత్త AI త్వరలో హోమ్ సెట్టింగ్స్‌లో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ ఆడియోఫ్లో త్వరలోనే స్మార్ట్‌ఫోన్ యాప్‌గా రూపొందించబడుతుంది. కానీ ఇప్పటివరకు ఇది స్త్రీల కంటే భిన్నమైన మూత్ర ప్రవాహం గల పురుషులపై మాత్రమే పరీక్షించబడింది. కాబట్టి స్త్రీ-కేంద్రీకృత వెర్షన్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు.

Next Story