ఈ సారైనా.. నకిలీకి బ్రేక్ పడేనా.. ?

by Disha Web Desk 9 |
ఈ సారైనా.. నకిలీకి బ్రేక్ పడేనా.. ?
X

దిశ, నర్సింహులపేట : వానాకాలం సాగుకు అన్నదాత సన్నద్ధమవుతున్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్నకు ఫలితం దక్కాలంటే మొదటి నుంచి పంట విషయంలో జాగ్రత్త తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలు పంట చేతికొచ్చే వరకు రైతన్నకు అన్ని కష్టాలే. రంగు రంగు ప్యాకింగ్​లతో రైతుల అమాయకత్వాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం సాగు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాలు ఎంపిక నుంచి పంట దిగుబడి వరకు శాస్త్రీయ పద్ధతుల అవలంభించి వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు,సూచనలు పాటిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు అధికారులు.

కొందరు డీలర్లు నకిలీ విత్తనాలు అమ్ముతూ ఏటా అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు. మరి ఈసారైనా నకిలీకి బ్రేక్ పడుతుందేమో వేచి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాథమిక సమాచారం.మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం కావడం వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి పంటలకు నేలలు అనుకూలంగా ఉండడంతో రైతులు ఆ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. మిర్చికి ఈ సంవత్సరం రేటు గిట్టుబాటు ధర కావడంతో జిల్లాలో మిర్చి సాగు పెరగనుంది. గత సంవత్సరం జిల్లాలో సుమారు 55 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్లు,ఈసారి ఒక లక్ష ఎకరాల సాగు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధం

పక్షం రోజుల్లో వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. డబ్బులు సిద్ధం చేసుకుని విత్తనాలు,ఎరువులు కొనుగోలుకు సిద్ధమవుతున్నారు.మహబూబాబాద్ జిల్లాలో గత సంవత్సరం సుమారు 55 వేల ఎకరాల్లో మిర్చి పంట 75,000 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

రంగు రంగు ప్యాకింగ్ లతో నట్టేట ముంచుతున్న వైనం

విత్తనాలు మార్చడం ద్వారా దిగుబడి బాగా వస్తుందనే నమ్మకంతో రైతులు నిలువునా మోసపోతున్నారు.నాణ్యమైన విత్తనాలకు ఏ మాత్రం తీసిపోకుండా నకిలీ విత్తనాలు రంగు రంగు ప్యాకింగ్‌లు చూసి రైతులు మోసపోతున్న సంఘటనలు కోకొల్లలు. నర్సింహులపేట మండలంలోని పిచ్చిరాం తండాకు చెందిన గిరిజన రైతులు ప్రముఖ కంపెనీకి చెందిన వరి విత్తనాలను నాటు వేసి మోసపోయిన సంఘటన రబీ సీజన్లోనే జరిగింది.'నకిలీ' విత్తనాల కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించాలని జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రంలో గిరిజన రైతులు ఫిర్యాదు చేశారు.మిర్చి విత్తనాలను గుంటూరు నుంచి తీసుకొచ్చిన రైతులు మోసపోయిన సంఘటన జిల్లాలో అనేకం. అసలు, నకిలీ విత్తనాలను గుర్తించలేని పరిస్థితి అన్నదాతలది. వ్యవసాయ శాఖ అధికారులు అసలు, నకిలీ ని గుర్తింపు ఎలా చేయాలని రైతులకు తెలిపిన దాఖలాలు ఇంతవరకు లేవు.

నకిలీని అరికట్టేనా..?:

మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట, దంతాలపల్లి, మరిపెడ, కురవి, డోర్నకల్ మండలాల్లో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి పంటలకు అనువైన నేలలు ఉన్నాయి. గిరిజన ప్రాంతం కావడంతో వారికి వ్యవసాయమే జీవనాధారం. అన్ని విత్తన కంపెనీలు, పురుగులమందులకు సంబంధించిన వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతుంది. నకిలీ విత్తనాలు కట్టడి చేసేందుకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టితే నకిలీని అడ్డుకట్ట వేయవచ్చునని అన్నదాతల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్టిఫైడ్ డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు అమ్మేటట్లు చర్యలు తీసుకోవాలని,గ్రామాలు, తండాల్లో తిరిగి అమ్మే వారి వద్ద విత్తనాలను కొనుగోలు చేయకుండా చేస్తే నకిలీకి బ్రేక్ చేసినట్లవుతుంది. విక్రయాలు జరుగుతున్న సమయంలో హడావుడి చేసే అధికారులు ఇప్పటికైనా తేరుకొని ముందస్తు చర్యలు తీసుకుంటా రేమో వేచి చూడాలి.

Next Story