బిగ్ న్యూస్.. వైఎస్సార్‌టీపీ విలీనంపై షర్మిల ఫైనల్ డెసిషన్.. మళ్లీ వెనక్కి

by Javid Pasha |
బిగ్ న్యూస్.. వైఎస్సార్‌టీపీ విలీనంపై షర్మిల ఫైనల్ డెసిషన్.. మళ్లీ వెనక్కి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం లేనట్లేనని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై కూడా షర్మిల కసరత్తు మొదలుపెట్టనున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి అన్ని నియోజవర్గాల్లోని ఆశావాహుల నుంచి వైఎస్సార్‌టీపీ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో వైఎస్సార్‌టీపీ వర్గాలు బిజీగా ఉన్నాయి.

షర్మిల రాకను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు తీవ్రంగావ్యతిరేకించారు. దీంతో పాటు ఏపీ రాజకీయాల్లో షర్మిలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావించగా.. అక్కడికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. తెలంగాణ నుంచే రాజకీయాలు చేసేందుకు షర్మిల ఆసక్తిగా చూపిస్తున్నారు. వీటిపై షర్మిల, కాంగ్రెస్ అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ 30 వరకు కాంగ్రెస్‌కు షర్మిలకు డెడ్‌లైన్ విధించగా.. ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒంటరిగానే వెళ్లాలని షర్మిల ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు.

కాంగ్రెస్‌లోకి షర్మిల రాకను మొదటి నుంచి రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై హైకమాండ్‌కు పలు నివేదికలు కూడా పంపించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు షర్మిల గతంలో ప్రకటించారు. కానీ రేవంత్ రెడ్డి చక్రం తిప్పి తుమ్మల నాగేశ్వర్ రావును కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. ఇక్కడి నేతలు అడ్డు పడటంతో షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపారు. ఇటీవల హైదరాబాద్‌లో డీకే శివకుమార్‌తో జరిగిన భేటీలో విలీనంపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీని కలిశారు. దీంతో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి ముందడుగు పడలేదు. డెడ్ లైన్ విధించినా విలీనం అంశంపై హస్తం పార్టీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని షర్మిల దాదాపు నిర్ణయించుకున్నారు.

Next Story

Most Viewed