కబ్జా కోరల్లో చిన్న రాయుడు చెరువు

by Mahesh |
కబ్జా కోరల్లో చిన్న రాయుడు చెరువు
X

దిశ, అల్వాల్: భూగర్భ జలాలకు చెరువులే ఆధారం.. అలాంటిది అ చెరువులే లేకుండా మాయం అవుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బాధ్యతగా ఉండి కబ్జాలను అరికట్టాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు పరోక్షంగా కబ్జాదారులకు మద్దతిస్తున్నట్లు అల్వాల్ వాసులు ఆరోపిస్తున్నారు. ఒకప్పడు అల్వాల్ సర్కిల్ చెరువులు కుంటలకు అల్వాల్ కొత్త చెరువు, చిన్నరాయుడు చెరువు, మోతుకుల కుంట, పాకాల కుంట తదితర పేర్లతోని ఎంతో నీటి వనరులున్న ప్రాంతంగా జనావాసాలకు అనుకూలమైన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అలాంటిది పాకాల కుంట మొత్తానికే మాయం కాగా కొత్తచెరువు, మోతుకుల కుంట, చిన్నరాయుని చెరువు తదితర చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకొని నానాటి కుచించుకపోతూ చెరువుల ఉనికే ప్రమాదం వాటిల్లుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

రాత్రికి రాత్రి పూడికలు

అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్‌లోని చిన్నరాయుని చెరువులో యథేచ్ఛగా పూడిచివేతలు కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రే ఈ పనులు ఆక్రమణదారులు చేపడుతుండడంపై స్థాని కంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో పురాతనమైన చెరువు ఇప్పటికే అధిక శాతం ఆక్రమణలకు గురైదందని ప్రస్తుతం ఆనందరావు నగర్ జానకీ నగర్ లకు సమీప ప్రాంతంలో ని చిన్నరాయుడు చెరువులో పూడ్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక కాలనీవాసులు వెల్లడించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపించారు. ఇరిగేషన్ యంత్రాంగంతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు ఈ విషయమై తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చెరువుకు సంబంధించిన అధిక శాతం భూమి ఆక్రమణలకు గురైంది ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పూడ్చివేతలతో చెరువు పూర్తిగా ఉనికి కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

చెరువు సంగతి అలా ఉంచితే ఇక్కడి బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలతో పాటు నిర్మాణాలను అడ్డుకోవడంలో సంబంధిత అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న రాయుడు చెరువు ఆక్రమణలో ఎవరి పాత్ర వారు విజయవంతంగా పోషిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెరువులో రాత్రికి రాత్రే చెరువు పూడ్చివేత పనులు జోరుగా సాగుతున్నాయని పెద్ద పెద్ద టిప్పర్లతో ఈ పను లను అర్ధరాత్రి పూట నిర్వహించడం పట్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ పనులు ఆగక పోవడం శోచనీయం. కాలనీలో రోడ్లపై పెద్ద వాహనాలు సహాయంతో చెరువులో మట్టితో ఇతర వ్యర్థాలతో చెరువు ను పూడ్చుతుండడంతో రోడ్లన్ని పాడవుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఇదేమిటని ప్రశ్నించేవారు కరువయ్యారని కాలనీవాసులు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా ఈ చెరువు ఆక్రమణలు అరికట్టడం తో పాటు సంబంధిత ఆక్రమణదారులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story