కాంగ్రెస్ గెలిచేది కేవలం ఆ ఒక్క MP సీటే: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
కాంగ్రెస్ గెలిచేది కేవలం ఆ ఒక్క MP సీటే: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు మాత్రమే.. అదీనూ నల్లగొండ స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులే లేరని, అందుకే ఓడిపోతుందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో మాట్లాడానని, ఎలక్షన్ బాగా జరిగిందన్నారు. తాను ప్రత్యేకంగా సర్వే కూడా చేయించానని బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉందన్నారు. సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్‌కు పడినట్టుగా సర్వే రిపోర్ట్ చెప్తోందన్నారు.

నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం వారే నామా నాగేశ్వరరావు గెలిపించుకుంటున్నారన్నారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉందన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని కాంగ్రెస్, బీజేపీకి భయం పట్టుకుందన్నారు. పెద్దపల్లిలో వివేక్ పైసలు చల్లి ప్రచారం చేశాడని విమర్శించారు. సిరిసిల్లలో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదని, కావాలంటే వెళ్లి సిరిసిల్లలో ఓటర్లను మైకులు పెట్టి అడగాలని సూచించారు.

సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరికి ఏమన్నా సంబంధం ఉందా..? ఆమె అక్కడ కాంగ్రెస్ క్యాండేట్ ఏంది అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ ని గెలిపించాలని అడ్రస్ లేని వ్యక్తి కి టికెట్ ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు వెలిచాల రాజేశ్వరరావు ఎవరు? అన్నారు. నాగర్ కర్నూల్ లో పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మిగతా బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులు సరితూగలేదన్నారు. ఆర్ఎస్పీ పేరు ప్రకటన తర్వాత పూర్తిగా సమీకరణాలు మారిపోయాయన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదని పేర్కొన్నారు. మెజార్టీ సీట్లలో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed