ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో పని చేయాలి : ఎమ్మెల్యే యెన్నం

by Aamani |
ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో పని చేయాలి : ఎమ్మెల్యే యెన్నం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రజా సమస్యల పరిష్కారంలో మానవీయ కోణంలో పనిచేయాలని,అప్పుడే వారికి తగిన న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్ రవినాయక్,మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ లతో కలిసి జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వలన అభివృద్ధి ఆగిపోయిందని,ఇకపై అధికారులందరూ అభివృద్ధిపై దృష్టి సారించి,పనులు వేగంగా జరపాలని ఆయన సూచించారు.గతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి వద్ద నుంచి తిరిగి భూములను స్వాధీనం చేసుకోవాలని,ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చట్టానికి, న్యాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ,ప్రజాస్వామ్య వ్యవస్థ ను కాపాడుతూ ప్రజా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.నియోజకవర్గంలో డిజిటల్ కంటెంట్ బుక్స్ ద్వారా 20 శాతం అధిక ఫలితాలను సాధించారని,విద్యాశాఖ అధికారుల కృషి ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం మంచి ఫలితాలను సాధించారని,ఈ సందర్భంగా ఆయన అభినందించారు.పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాం,టెక్ట్స్,నోట్ బుక్స్ ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందని,సాంకేతిక,చిన్న చిన్న విషయాలను చూపి అభివృద్ధి పనులను ఆపకండని ఆయన కోరారు.రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు,వాటిపై అధికారులు పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలని,ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం వంద శాతం అమలు దిశగా పని చేయాలని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed