మార్నేనిని వ‌రించిన టెస్కాబ్.. కాంగ్రెస్‌లో చేరిన కొద్ది నెల‌ల్లోనే కీల‌క ప‌ద‌వి

by Aamani |
మార్నేనిని వ‌రించిన టెస్కాబ్.. కాంగ్రెస్‌లో చేరిన కొద్ది నెల‌ల్లోనే కీల‌క ప‌ద‌వి
X

దిశ, హనుమకొండ టౌన్ : రాష్ట్ర స్థాయిలో అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి వ‌రంగ‌ల్ జిల్లా ఖాతాలో ప‌డింది. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) చైర్మన్‌గా వ‌రంగ‌ల్ డీసీసీబీ చైర్మ‌న్‌గా ఉన్న మార్నేని రవీందర్‌రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా, టెస్కాబ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని టెస్కాబ్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా ముగిసింది. ఎన్నిక పూర్తయిన తరువాత రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్‌ హరిత నుంచి రవీందర్‌రావు నియామక పత్రాన్ని అందుకున్నారు. గతంలో టెస్కాబ్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఉన్న కొండూరి రవీందర్‌రావు, మహేందర్‌రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో అంతకు ముందే వారు రాజీనామా చేశారు. నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తోపాటు బోర్డు మెంబర్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని మంత్రి అభినందించారు.

Next Story

Most Viewed