నీళ్ల నిర్వహణలో ఆప్ ప్రభుత్వం ఫెయిల్: బీజేపీ

by Harish |
నీళ్ల నిర్వహణలో ఆప్ ప్రభుత్వం ఫెయిల్: బీజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: గత రెండు మూడు నెలలుగా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజల సమస్యను పరిష్కరించడానికి ఆప్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఢిల్లీ బీజేపీ మంగళవారం ఆప్‌పై విరుచుకుపడింది. నగరంలో నీటి నిర్వహణలో ఆప్ విఫలమైందని విమర్శించింది. ఢిల్లీ జల్ బోర్డులో అవినీతి జరిగింది, ప్రభుత్వ రక్షణలో నీరు దొంగిలించబడుతోంది. అందుకే నగరంలో ప్రజలు తీవ్ర నీటి కొరత పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో నీళ్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దానికి అనుగుణంగా వేసవి కంటే ముందుగానే ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, కానీ ప్రభుత్వం అలా చేయలేదు, నీటి సంక్షోభం తీవ్రమైన తర్వాత ఇప్పుడు కష్టపడుతున్నారు, దీనికి ఢిల్లీ జల్ బోర్డు, దాని అధికారులు, చైర్మన్, ఢిల్లీ ప్రభుత్వమే బాధ్యులని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా విలేకరుల సమావేశంలో అన్నారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాట్లాడుతూ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీతో తాను మాట్లాడానని, దేశ రాజధానికి కేటాయించిన వాటా ప్రకారం నీటిని అందిస్తున్నట్లు తనకు తెలియజేశారని చెప్పారు. ఇటీవల ఢిల్లీ నీటి మంత్రి అతిషి నగరంలో నీటి సంక్షోభానికి కారణం హర్యానా అని అన్నారు. దేశ రాజధానికి రావాల్సిన నీటి వాటాను విడుదల చేయడం లేదని ఆరోపించడంతో పాటు, నీటి విడుదల కోరుతూ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సీఎంలకు లేఖ కూడా రాశారు. సుప్రీం కోర్టులో సైతం పిటిషన్ వేశారు. అలాగే, ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కలగజేసుకుని హర్యానా సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూడాలని అభ్యర్థించారు.

Next Story

Most Viewed