అక్కరకురాని రైతు వేదికలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన వైనం

by Disha Web Desk 6 |
అక్కరకురాని రైతు వేదికలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన వైనం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు ఎందుకూ ఉపయోగపడడం లేదు. ఫస్ట్ రైతు వేదిక భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం జిల్లాలోని కొడకండ్లలో 2020 అక్టోబర్ 31న ప్రారంభించారు. రైతులకు అవగాహన కల్పించడం, శిక్షణను అందించడం వీటి ప్రధాన ఉద్దేశం. కానీ నిర్మాణం పూర్తయి వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నా అవి రైతులకు ఏ రకంగానూ ఉపయోగపడడంలేదు. అన్ని రైతు వేదికలకు మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా నీటి వసతి కల్పించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసుకున్నా ఇప్పటికీ చాలా రైతు వేదికలకు అలాంటి సౌకర్యం అందుబాటులోకి రాలేదు. రాష్ట్రం మొత్తం మీద మూడు మినహా మిగిలిన 2,598 రైతు వేదికల నిర్మాణం పూర్తయినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తెలిపారు.

ఒక్కో వేదికకు రూ. 22 లక్షలు..

ఒక్కో రైతు వేదికకు రూ. 22 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ. 12 లక్షలను రాష్ట్ర వ్యవసాయ శాఖ సమకూర్చింది. మిగిలిన రూ. 10 లక్షలను గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇస్తున్న నిధుల నుంచి వినియోగించింది. రాష్ట్రంలోని మొత్తం 2,601 రైతు వేదికలకు రూ. 572.22 కోట్లు ఖర్చు అవుతుందని మూడేండ్ల క్రితం ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 29 రైతు వేదికలు దాతలు ఇచ్చిన విరాళాలతో నిర్మాణమయ్యాయి. మరో 139 రైతు వేదికలకు స్థానికంగా ఉన్న పలువురు ఉచితంగానే స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. దాదాపు మూడేళ్ల కసరత్తు తర్వాత మూడు మినహా మిగిలిన రైతు వేదికలన్నీ తక్షణం వాడుకోడానికి సిద్ధంగా ఉన్నా మాత్రం నిరుపయోగంగానే ఉండిపోయి, అలంకారప్రాయంగా మిగిలాయి.

నీరుగారుతున్న సర్కారు లక్ష్యం..

పంటల సంరక్షణ, అధిక దిగుబడులు పొందడానికి రైతులకు మెలకువలను వివరించడం, వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా శిక్షణ కల్పించడం తదితరాల కోసం రైతు వేదికలు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వీటి గురించి అప్పట్లో వివరించారు. యంత్రీకరణ, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాలపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వారంలో రెండు రోజులు శిక్షణ ఇస్తారని ప్రభుత్వం పేర్కొన్నా అలాంటిదేం జరగడం లేదు. దీంతో ఆ నిర్దేశిత లక్ష్యం నెరవేరడంలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధుల్లో 75 శాతాన్ని వినియోగించేలా ఫార్ములా తయారు చేసింది. మిగిలిన 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం మెటీరియల్ కాపొంనెంట్ కింద వాడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల గురించి గొప్పగా చెప్పుకుంటున్నది. అందుకే విపక్షాలు ఈ కామెంట్లకు ‘సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్టానిదా.. అంటూ విమర్శించాయి.

అరకొర వసతులు..

కొన్ని రైతు వేదికల్లో కనీస నీటి వసతి కూడా లేదు. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సౌకర్యం లేక వృథాగా పడి ఉన్నాయి. ఇంకోవైపు స్థలం లేక చాలాచోట్ల ఊరికి దూరంగా నిర్మించడంతో వేదికలు రైతులకు ఉపయోగపడకపోగా రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు, అనధికార బార్‌లుగా తయారయ్యాయి. దీనికి తోడు మహిళా వ్యవసాయ విస్తరణాధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటరిగా అక్కడ ఉండే పరిస్థితిల లేదు. ప్రతి నెలా రూ. 2 వేల మేర నిర్వహణ ఖర్చుల కింద ఇస్తామని ప్రభుత్వం చెప్పినా అమలుకు నోచుకోలేదు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలో 2020-21లో రూ. 455.45 కోట్లు, ఆ తర్వాత సంవత్సరం రూ. 62.14 కోట్ల చొప్పున ఖర్చయిందని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తెలిపారు.

Next Story

Most Viewed