కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు కండకావరం తలకెక్కింది.. విరుచుకుపడిన బండి సంజయ్

by prasad |
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు కండకావరం తలకెక్కింది.. విరుచుకుపడిన బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు కండకావరం తలకెక్కిందని అందువల్లే హిందూ దేవుళ్లను, రాముల వారి అక్షింతలు, ప్రసాదాలను అవమానించేలా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. హిందూ దేవుళ్లను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎమ్మెల్సీ బై పోల్ లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మత పరమైన రిజర్వేషన్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాము అన్ని వర్గాలను సమానంగా చూస్తే స్వాగతిస్తాం కానీ ఒక వర్గానికి కొమ్ముకాస్తే సహించేంది లేదన్నారు.

మైనార్టి డిక్లరేషన్ చేసిన కాగ్రెస్ పార్టీకి 80 శాతం ఉన్న హిందువులంతా గుణపాఠం చెప్పాలన్నారు. మతపరమైన రిజర్వేషన్ ఇవ్వాలని చూస్తే అసెంబ్లీలో కొట్లాడేందుకు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అదే విధంగా శాసన మండలిలో కొట్లాడేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఈవిషయంలో హిందువులంతా ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన మాకు లేదని ఆ మాట మేము ఎక్కడా అనలేదని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కాంగ్రెస్ వారు ఎవరికి ఇవ్వరని వారిలో వారే ప్రభుత్వాన్ని కూలదోసుకుంటారని సెటైర్ వేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడిని రోడ్లపై ప్రజలు తిరగనిచ్చే పరిస్థితి లేదన్నారు. ఆరు గ్యారెంటీల సంగతి ఏంటో ప్రజలు నిలదీస్తారన్నారు.

కాళేశ్వరం తర్వాత అదే అదిపెద్ద స్కామ్:

తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే జరిగిందని ఈ శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాం నుంచే ఈ శాఖ అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ధ్వజమెత్తారు. శనివారం నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. రైతుల వద్ద ధాన్యం సేకరించి ఎఫ్ సీఐ కి అప్పగించేందుకు మధ్య వర్తిగా ఉండే ఈ శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. కాళేశ్వరం విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని.. పౌరసరఫరాల శాఖలో అవినీతిపై విచారణ కాళేశ్వరం వలే మిగిలిపోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనైనా పరిస్థితి మారుతుందనుకంటే అదే పరిస్థితి కొనసాగుతోందని ఫైర్ అయ్యారు.

రైస్ మిల్లర్ల అసోసియేషన్ లోని కొంత మంది నాయకులు అక్రమార్కులు ఉన్నారని వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయకులకు లంచాలు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైసు మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని దీనిపై విచారణ చేసి నిగ్గు తేల్చారన్నారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు తాము సహకరించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అదే తరహాలో కాంగ్రెస్ నాయకులు వేల కోట్ల అక్రమాలు సంపాధించుకుని ఆ డబ్బులను ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. ధాన్యాబండాగారంగా ఉన్న నల్గొండ ప్రాంతాన్ని కేసీఆర్ అనే మూర్కుడు ఎడారిగా మార్చాడని, కృష్ణజలాల విషయంలో కేసీఆర్ లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను సర్వనాశనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్తోందని అన్నారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక బీజేపీ అభ్యర్థి గజ్జుల ప్రేమేందర్ రెడ్డిని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిపించాలన్నారు.

Next Story

Most Viewed