కూకట్‌పల్లి వంద పడకల హాస్పిటల్ కలేనా?

by Mahesh |
కూకట్‌పల్లి వంద పడకల హాస్పిటల్ కలేనా?
X

దిశ, కూకట్​పల్లి: నియోజకవర్గం కు చెందిన లక్షలాది మంది ప్రజల దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. 2023 ఎన్నికల సందర్భంలో నియోజకవర్గంలో ఏ సభలో చూసిన ఒకటే మాట, ఒకటే వాగ్ధానం.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందిచేందుకు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఏకంగా అప్పటి రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి నాయకుడు నోటి మాట ఇదే. 366 రోజులు గడిచిన 100 పడకల ఆసుపత్రి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావిడిగా కేపీహెచ్​బీ కాలనీలోని రెండెకరాల హౌసింగ్​బోర్డు స్థలంలో 2023, జూన్ 10వ తేదీ అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్​రావు చేతుల మీదుగా రూ. 31 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా హౌసింగ్ బోర్డు అధికారుల నుంచి అధికారికంగా సదరు రెండెకరాల స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికి స్వాధీనం చేసుకోలేదని విశ్వసనీయ సమాచారం. హౌసింగ్​ బోర్డు అధికారులు స్థలం మీకు కేటాయించడం పూర్తయింది. జీవో జారీ అయింది భూమి తీసుకోండి మహాప్రభు అంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఎన్ని సార్లు లేఖలు రాసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

35 మంది డాక్టర్లు, 89 మంది సిబ్బంది

కేపీహెచ్బీ కాలనీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన కు హాజరైన మంత్రి హరీష్​ రావు తొమ్మిది నెలలలో వంద పడకల ఆసుపత్రి పను లు పూర్తి చేస్తాం. ఆసుపత్రిలో 89 మంది వైద్య సిబ్బంది, 35 మంది డాక్టర్లు 365 రోజులు, 24 గంటలు వైద్య సేవలు అందిస్తారు అంటు ప్రజలతో వాగ్దానం చేశారు. కాగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగి నేటికి సరిగా 366 రోజులు పూర్తయిన హాస్పిటల్ పునాదులకు గుంతలు కూడా తీయలేదు.

ఎన్నికలు ముగిసాయిగా

రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కూకట్​పల్లి నియోజకవర్గంలో జరిగే హడావిడి అంతా ఇంతా కాదు. నియోజకవర్గంలో ఎక్కడా లేని అభివృద్ధి, ఎక్కడా లేని శంకుస్థాపనలు, సభలు సమావేశాలతో ప్రతి కాలనీలో పండుగ వాతావరణం ఉంటుంది. ఎన్నికల్లో భాగంగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు రెండు సార్లు జీహెచ్ఎంసీ ఎన్నికలు రెండు సార్లు జరిగిన ఎంపీ ఎన్నికల్లో ప్రతి బీఆర్​ఎస్​ నాయకుడు, ప్రజా ప్రతినిధి నోట వాగ్ధానం వంద పడకల ఆసుపత్రి. ఎన్నికలకు 5 నెలల ముందు హడావిడిగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం మారడం తోనే ఆసుపత్రి ఊసే తీయడం మరిచారన్న ఆరోపణలున్నాయి.

సమాచారం లేదు

కేపీహెచ్​బీ కాలనీలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిన విషయం తెలుసు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం లేదు. నిధులు, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాము.:- రఘునాథ్​ స్వామి, జిల్లా వైద్య శాఖ అధికారి, మేడ్చల్​ జిల్లా

వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాం

కేపీహెచ్​బీ కాలనీలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రెండెకరాల హౌసింగ్​ బోర్డు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్​ బోర్డు నుంచి పలు మార్లు వైద్య ఆరోగ్య శాఖకు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖను పంపించాం. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు.:- కిరణ్​ బాబు, ఈఈ, హౌసింగ్​ బోర్డు శాఖNext Story

Most Viewed