యాక్టివ్ కంటే రికవరీలు ఎక్కువ.. రోజూ 9వేల పైన కేసులు

by  |
యాక్టివ్ కంటే రికవరీలు ఎక్కువ.. రోజూ 9వేల పైన కేసులు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజకూ విజృంభిస్తోంది. గత ఎనిమిది రోజులుగా నిత్యం 9,000లకు తగ్గకుండా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో(బుధవారం ఉదయం 8గంటల వరకు) 9,985 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 279మంది మృతిచెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,76,583కు చేరుకుంది. ఊరట కలిగించే విషయం ఏమిటంటే దేశంలో యాక్టివ్ కేసులను రికవరీలు అధిగమించాయి. తాజాగా 24 గంటల్లో 5,991 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,35,206కు చేరుకున్నాయి. ఇందులో ఒకరు విదేశాలకు చెందిన వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,33,632మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో 48.99శాతం మంది వ్యాధిగ్రస్తులు హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఉదయం 8గంటల వరకు 279మంది మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 7,745కు చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50లక్షల టెస్టులను నిర్వహించినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. 2,76,583 కేసులతో ప్రపంచంలో కరోనా బాధితుల్లో ఇండియా ఐదో స్థానంలో నిలిచింది. మొదటి నాలుగు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే కొనసాగుతున్నాయి.

– దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 90,787 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు(34,914), ఢిల్లీ(31,309), గుజరాత్(21.204), ఉత్తర్‌ప్రదేశ్(11,335), రాజస్థాన్(11,245), మధ్యప్రదేశ్‌(9,848) వైరస్ కేసులు ఉన్నాయి.

– మహారాష్ట్రలో సమూహ వ్యాప్తి జరగడం లేదని ఆ రాష్ట్ర వైద్య మంత్రి రాజేశ్ తొపె తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కేసులతో ఆర్థిక రాజధాని హాట్‌స్పాట్‌గా మారింది. ఇప్పటివరకు మొత్తం 90వేల కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో మొత్తం 84వేల కేసులు నమోదు కాగా, ఆ దేశాన్ని మహారాష్ట్ర అధిగమించింది.

– దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మంగళవారం నాటికి 51వేల కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో వుహాన్ కంటే 700 కేసులు ముంబయిలోనే నమోదయ్యాయి.

– ఢిల్లీలో జూలై ఆఖరు నాటికి 5.50 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రస్తుతం నగరంలో 9వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెల ఆఖరు నాటికి 80వేల పడకలు అవసరమవుతాయిని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 22 ప్రయివేటు ఆసుపత్రుల్లో పడకలను రెట్టింపు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

– కేరళలో ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య 2లక్షలు దాటింది. ఇందులో చాలావరకు సొంత ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. 1900 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

– దేశవ్యాప్తంగా ఆంక్షలను సడలించినప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8 నుంచి ప్రార్థన మందిరాలు, మాల్స్ కూడా తెరుచుకున్నాయి.

– ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోందని, ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

– ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 73,40,842 మంది మహమ్మారి బారిన పడ్డారు. దాదాపు 4,14,106మంది మృతిచెందారు. 36,19,340మంది రికవరీ అయ్యారు.

Next Story

Most Viewed