రైళ్ల నిలిపివేత.. పునరుద్ధరించాలని వేడుకోలు

by  |
రైళ్ల నిలిపివేత.. పునరుద్ధరించాలని వేడుకోలు
X

దిశ, జడ్చర్ల: కరోనా వైరస్ అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంత మారుతోంది. ఇతర రంగాలు మెరుగుపడుతున్నా రైల్వే శాఖలో మాత్రం మార్పు లేదు. ఆశించిన రాబడి లేదని దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు మూసివేస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా నడిచే 9 ప్యాసింజర్ నడిపించడం లేదు. వీటిపైనే ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలోని గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ నుంచి నిత్యం 10 వేల మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. ఇక్కడి నుంచి 9 ప్యాసింజర్ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, నుంచి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్ మీదుగా గుంటూరు, డోన్, కర్నూల్, గుంతకల్, రాయచూరు, వరకు రాకపోకలు సాగించేవారు. అలాగే తుంగభద్ర, జైపూర్, యశ్వంత్‌పూర్ ధర్మవరం, ఎక్స్‌ప్రెస్‌లు నడిచేవి. లాక్‌డౌన్‌లో ప్రయాణికుల రైళ్లను రద్దు చేసి గూడ్స్ వాటిని మాత్రమే నడిపారు. రెండు నెలలుగా దూర ప్రయాణం చేసే వారి కోసం మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. అవి కూడా ఉమ్మడి జిల్లా ప్రధాన స్టేషన్లలో ఆగడం లేదు.

సగం డబ్బులు ప్రయాణానికే..

గద్వాల నుంచి కొత్తూరు వరకు స్థానిక ప్రజలు హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు, కార్మికులుగా పనులు చేస్తుంటారు. మరి కొందరు కూరగాయలు, పండ్లు అమ్మేందుకు వెళ్తుంటారు. అలాగే గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి కర్నూల్‌కు వేలాది మంది నిత్యం వెళ్లి వస్తుంటారు. రైళ్లలో ప్రయాణించేందుకు 150 కిలోమీటర్ల వరకు సీజనల్ రైల్ పాస్ తీసుకుంటే నెలకు రూ.350 నుంచి రూ. 500 వరకు ఖర్చయ్యేది. జడ్చర్ల నుంచి కాచిగూడ వరకు ప్రయాణిస్తే ప్యాసింజర్ రైలుకు రూ.25, ఎక్స్‌ప్రెస్ రైలుకు రూ.45 అయ్యేది. ఇదే బస్సులో ప్రయాణిస్తే జడ్చర్ల నుంచి హైదరాబాద్‌కు రూ.100 ఖర్చవుతున్నది. ప్యాసింజర్ రైళ్లు ఆపకపోవడంతో బస్సులో వెళ్తే నెలకు రూ.5వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సంపాదనలో సగం ఆదాయం బస్సుచార్జీలకే పోతున్నదని ఇక్కడి వారు వాపోతున్నారు. బస్సు ప్రయాణాలు చేయలేక పది నెలలుగా పనులు మానేసి అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed