దేశంలో తొలి ‘పీఠిక’ పుణ్యస్థలం

by  |
దేశంలో తొలి ‘పీఠిక’ పుణ్యస్థలం
X

భారత చరిత్రలో మొదటి సారి ఓ పుణ్యస్థలంలో రాజ్యాంగ పీఠికను శిలాఫలకంపై చెక్కి పూజించే ఏర్పాటు చేశారు. మతపరమైన ప్రదేశంలో ‘రాజ్యాంగ ప్రవేశిక’ను చెక్కిన ఫలకాన్ని స్థాపించి శనివారంనాడు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ అరుదైన సన్నివేశానికి మహారాష్ట్ర ముంబయిలోని షా మఖ్దూం ఫకీ అలీ మాహిమికి చెందిన మాహిమ్ దర్గ వేదికగా నిలిచింది. మన దశంలో ఒక మతపరమైన ప్రదేశంలో రాజ్యాంగ పీఠిక ఫలకాన్ని స్థాపించడం ఇదే మొదటిసారి. ఈ వారాంతంలో జరుపుకోబోతున్న 607వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఈ ఫలకాన్ని స్థాపించినట్టు నిర్వాహకులు తెలిపారు.

ఈ వేడుకకు వందల సంఖ్యలో మతబోధకులు, లౌకికవాదులు, న్యాయవాదులు, వైద్యులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. మూకుమ్మడిగా పీఠికను చదివారు. ట్రెడిషనల్ జెండాతోపాటు జాతీయ పతాకాన్ని ఎగరేసి జాతీయగీతాలాపన చేశారు. ఈ ఫలకం తాత్కాలికమైనదేనని మేనేజింగ్ ట్రస్టీ సుహైల్ ఖాండ్వాని అన్నారు. గాజు ఫలకంపై బంగారు అక్షరాలతో వాటి వెనుక త్రివర్ణం, భారతదేశ చిత్రపటం కనిపించేలా శాశ్వతమైనదాన్ని వచ్చేవారంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. భిన్నవర్గాల మధ్య సుహృద్భావం, సామరస్యం, శాంతి విరాజిల్లాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

Next Story

Most Viewed