ఉన్నది ఉన్నట్టు: ఉపఎన్నికలు ఎవరికోసం వస్తున్నాయి?

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: ఉపఎన్నికలు ఎవరికోసం వస్తున్నాయి?
X

ఇక పోలింగ్ సమయానికి ఓటుకు నోటు సరేసరి. సాధారణ ఎన్నికలలో మాగ్జిమమ్‌గా వెయ్యి రూపాయలు పలికిన ఓటు ధర హుజూరాబాద్ సమయానికి పది వేలకు పెరిగింది. ఇప్పుడు మునుగోడులో అది 30 వేలు దాటింది. పార్టీలకు, ఓటర్లకు మధ్య ఇదో రకమైన క్విడ్ ప్రో కో విధానం. ఐదేళ్ల తలరాత సంగతేమోగానీ ఐదు వందల నోట్లు చేతిలోకి చేరడమే ప్రధానమైపోయింది. పార్టీలకు ఓటు, ప్రజలకు నోటు. ఇదీ ఉప ఎన్నికల తంతు. అయితే ఇదంతా సాక్ష్యాలు, ఆధారాలూ లేకుండా జరిగిపోయే ప్రక్రియ. అందుకే ఉప ఎన్నికలు రావాలనేదే జనం డిమాండ్. నెల రోజుల పాటు చేతి ఖర్చు తగ్గిపోతుంది. కొత్త పథకాలు, నియోజకవర్గం డెవలప్‌ అవుతుందనేది ప్రజల వాదన. ఇప్పుడు నైతికం, అనైతికం అనే చర్చకు తావు లేదు. ప్రశ్నించాల్సిన ప్రజల మనస్తత్వం మారిపోయింది. ప్రభుత్వంపై కొట్లాడాల్సిన ప్రతిపక్షాలూ సైలెంట్‌గా ఉన్నాయి. మూడున్నరేళ్లలో సర్కారు నుంచి రాబట్టలేని నిధులు, పనులు ఏడాది కాలంలో ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నకు అభ్యర్థుల నుంచి సమాధానం లేదు.

ఒకప్పుడు ఏదైనా పొరపాటు చేస్తేనో లేక తప్పు జరిగితేనో నైతిక బాధ్యతగా ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసేవారు. లేదా చనిపోతే ఉప ఎన్నిక అనివార్యమయ్యేది. కానీ, ఇప్పుడు ఉప ఎన్నికలకు అర్థం, పరమార్థమే మారిపోయింది. సత్తా చాటుకోడానికో లేక బలం ఉందని నిరూపించుకోడానికో జరుగుతున్నాయి. పంతాలు పట్టింపుల కోసం రిజైన్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగిన సమయంలో టీఆర్ఎస్ నాయకులు చేసిన రిజిగ్నేషన్‌లుగానీ తాజాగా మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాగానీ అలాంటివే. ఎవరి కోసం రిజైన్ చేస్తున్నారో, ఎందుకోసం చేయాల్సి వస్తున్నదో నిర్దిష్టమైన కారణాలేవీ ఉండవు. కేవలం వారి వారి రాజకీయ ప్రయోజనాలు తప్ప.

ప్రజా ప్రతినిధులు చేతకానితనాన్ని, వైఫల్యాన్ని రాజీనామాతో సరిపెట్టుకుంటున్నారు. తిరిగి అదే నేత ఉప ఎన్నికలో పోటీ చేయడం ఒక ప్రహసనంగా, తమాషాగా మారిపోయింది. ప్రజలు తమ వెనకే ఉన్నారని గొప్పగా చెప్పుకోడానికి ఉప ఎన్నికలను సృష్టిస్తున్నారు. తమిళనాడులో 1956లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సుమారు 150 మంది చనిపోయారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్‌బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. 1990వ దశకంలో నితీశ్‌కుమార్ సైతం అస్సాంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది చనిపోవడంతో పదవి నుంచి తప్పుకున్నారు. అలాంటి సందర్భాలలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కానీ, ఇప్పుడు అలాంటివేమీ లేవు.

టీఆర్ఎస్‌కు ఒక పొలిటికల్ గేమ్

తెలంగాణ ప్రాంతం వెనుకబాటుతనానికి గురైందని, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే మాత్రమే అభివృద్ధి సాధ్యమంటూ సమైక్య రాష్ట్రంలో టీఆర్ఎస్ తరచూ వాదించేది. దానికి సమర్ధనగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ నాయకులు రాజీనామా చేసేవారు. తెలంగాణ వాదనతో ఉద్యమాన్ని రక్తి కట్టించడానికి, ప్రజలలో ఎమోషన్స్ ను రేకెత్తించడానికి ఉప ఎన్నికలను ఒక బలమైన అస్త్రంగానే ఆ పార్టీ వాడుకున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలేదనే ఆరోపణలతో కేసీఆర్ కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. ఆ తర్వాత కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తిరిగి ఎన్నికయ్యారు.

వైఎస్సార్ హయాంలో సైతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో గెలవడం ఒక రొటీన్ ప్రక్రియగా మారిపోయింది. అసెంబ్లీ లేదా లోక్‌సభకు సిట్టింగ్ ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఆకస్మికంగా మృతి చెందడంతో దుబ్బాక, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ, ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికను పరిశీలిస్తే అలాంటి నిర్దిష్టమైన కారణమేదీ లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రిజైన్ చేయాల్సి వచ్చిందంటూ రాజగోపాల్‌రెడ్డి సమర్ధించుకున్నారు. 'తిలా పాపం తలా పిడికెడు' తరహాలో అటు సర్కారు నిధులు విడుదల చేయలేదు. ఇటు రాజగోపాల్‌రెడ్డి సైతం విపక్ష కాంగ్రెస్‌లో ఉన్నందున ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేకపోయారు. చివరకు ఇది ఉప ఎన్నికకు దారితీసింది. ఈ కారణం సమంజసమా కాదా? అనేది వేరే చర్చ.

Also read: ఉన్నది ఉన్నట్టు: అక్కడ డబ్బులు ఊరికే ఎందుకు వస్తున్నాయి?

ఇప్పుడలాంటి గౌరవాలు లేవు

నిజానికి ఒక అభ్యర్థి చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఒకప్పుడు ఇతర పార్టీలేవీ అభ్యర్థులను నిలబెట్టేవి కావు. చనిపోయిన నేత కుటుంబానికి చెందిన లేదా ఆ పార్టీకి చెందినవారికి మాత్రమే పోటీ చేసేలా అవకాశాలు ఇచ్చేవి. సానుభూతితో ఈ నిర్ణయాలు తీసుకునేవి. ఆ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకారం అందించేవి. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. పవర్‌లోకి రావడమే పార్టీల పరమావధి అయింది. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోయిన కారణంగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను నిలబెట్టాయి. నాగార్జునసాగర్‌లోనూ నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలోనూ ఇదే రిపీట్ అయింది. అంతకుముందు నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు ఇలాంటి గౌరవాలు, మర్యాదలేమీ లేవు.

అటు కేంద్రంలోగానీ ఇటు రాష్ట్రంలోగానీ అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష స్థానాల అభివృద్ధిపై చిన్నచూపు, నిధుల విడుదలలో వివక్ష ఒక సహజ పరిణామంగా మారింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన ఆ ప్రజా ప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, వారి నుంచి ఒత్తిడిని ఎదుర్కోలేక, ప్రభుత్వం నుంచి సాకారం చేసుకోలేక డిఫెన్సులో పడిపోతున్నారు. రాజీనామా చేయడం, మళ్లీ పోటీ చేసి గెలవడం రెగ్యులర్ ప్రాక్టీసుగా మారిపోయింది. ఉప ఎన్నిక నిర్వహణకు ప్రజా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తున్నది. అభ్యర్థులు కూడా ప్రిస్టేజ్ కోసం భారీ స్థాయిలో డబ్బును వెదజల్లక తప్పడం లేదు. ఓటు 'విలువ' అంటూ ప్రజాస్వామిక సూత్రాలను ఎన్నికల సంఘం ఎంతగా వల్లెవేసినా అది చివరకు 'ధర'గా మారిపోయింది.

Also read: ఎన్నికల ముందే 'బంధు'లా! ఇవి కొనసాగేనా?

స్వచ్ఛత కోల్పోయిన ఓటు

ఓటు తన స్వచ్ఛతను కోల్పోయింది. ఎంత ఇస్తే ఓట్లు పడతాయో పార్టీలు, అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఎంత ఇస్తే ఓటు వేయాలో ఓటర్లు డిసైడ్ చేసుకుంటున్నారు. ఓటర్లకు భేషజాలేమీ లేవు. మార్కెట్ రేటు తరహాలో డిమాండ్ చేస్తున్నారు. ఓటుకు నోటు విశృంఖలమైంది. మద్యం ఏరులై పారుతూ ఉన్నది. ర్యాలీలకు కిరాయి జనాలను తరలించుకోడానికి రోజుకూలీ విధానం అమలవుతున్నది. డబ్బులివ్వడం పార్టీలకు, అభ్యర్థులకు కామన్ అయిపోయింది. ఏమీ ఇవ్వకపోతే ఎందుకు ఓటేస్తామని డిమాండ్ చేయడం ఓటర్లకూ షరతుగా మారింది. ఉప ఎన్నికలలో ఖర్చు ఊహకు అందనంతగా పెరిగిపోయింది. సాధారణంగా అధికార పార్టీ అభ్యర్థులే గెలుస్తారనే అభిప్రాయం పటాపంచలైంది.

ఉప ఎన్నికలను అధికార పార్టీ ఛాలెంజ్‌గా తీసుకుంటున్నది. పాలనను గాలికొదిలేసి శక్తులన్నింటినీ అక్కడే మోహరిస్తున్నది. తెలంగాణ అనుభవాలనే పరిశీలిస్తే ఎన్నికలు, ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయని, సంక్షేమ పథకాలు ఉనికిలోకి వస్తాయనే ఒక సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుబంధు ఉనికిలోకి వచ్చింది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా దళితబంధు వచ్చింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా గిరిజనబంధు ప్రకటన వెలువడింది. ఇక నియోజకవర్గంలో రాత్రికి రాత్రే రోడ్లు, అభివృద్ధి పనులు జరిగిపోతున్నాయి. పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలవుతున్నాయి. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి సాయం, కొత్త రేషను కార్డులు.. ఇలాంటివి చకచకా జరిగిపోతున్నాయి.

చుక్క, ముక్క దొరుకుతున్నాయని

ఉప ఎన్నిక వస్తే మాత్రమే ఇవి సాధ్యమవుతున్నాయని ప్రజలలో నమ్మకం స్థిరపడింది. నియోజకవర్గంలో సౌకర్యాలు రావాలన్నా, వ్యక్తిగతంగా పథకాల లబ్ధి కలగాలన్నా ఉప ఎన్నికే బెస్టు అనే భావన ఏర్పడింది. దీనికి తోడు ప్రతిరోజూ ఏదో ఒక పార్టీ నుంచి పచ్చ నోటు, మందు, మాంసం, స్వీట్లు, గిఫ్టు ప్యాక్‌లు చేతికందుతున్నాయి.

నెల రోజుల ప్రచార సమయంలో అన్ని పార్టీల ర్యాలీలు, రోడ్‌షోలకు హాజరైనందుకు స్థానికులకు కిరాయిగా రూ. 500 నగదుతో పాటు చుక్క, ముక్క దొరుకుతున్నాయి. తిండి అవసరాలకు స్వంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.

Also read: ఉన్నది ఉన్నట్టు: పొలిటికల్ పవర్ యాత్రలు

ప్రజలూ మారిపోయారు

ఇక పోలింగ్ సమయానికి ఓటుకు నోటు సరేసరి. సాధారణ ఎన్నికలలో మాగ్జిమమ్‌గా వెయ్యి రూపాయలు పలికిన ఓటు ధర హుజూరాబాద్ సమయానికి పది వేలకు పెరిగింది. ఇప్పుడు మునుగోడులో అది 30 వేలు దాటింది. పార్టీలకు, ఓటర్లకు మధ్య ఇదో రకమైన క్విడ్ ప్రో కో విధానం. ఐదేళ్ళ తలరాత సంగతేమోగానీ ఐదు వందల నోట్లు చేతిలోకి చేరడమే ప్రధానమైపోయింది. పార్టీలకు ఓటు, ప్రజలకు నోటు. ఇదీ ఉప ఎన్నికల తంతు. అయితే ఇదంతా సాక్ష్యాలు, ఆధారాలూ లేకుండా జరిగిపోయే ప్రక్రియ. అందుకే ఉప ఎన్నికలు రావాలనేదే జనం డిమాండ్. నెల రోజుల పాటు చేతి ఖర్చు తగ్గిపోతుంది.

కొత్త పథకాలు, నియోజకవర్గం డెవలప్‌ అవుతుందనేది ప్రజల వాదన. ఇప్పుడు నైతికం, అనైతికం అనే చర్చకు తావు లేదు. ప్రశ్నించాల్సిన ప్రజల మనస్తత్వం మారిపోయింది. ప్రభుత్వంపై కొట్లాడాల్సిన ప్రతిపక్షాలూ సైలెంట్‌గా ఉన్నాయి. మూడున్నరేళ్ళలో సర్కారు నుంచి రాబట్టలేని నిధులు, పనులు ఏడాది కాలంలో ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నకు అభ్యర్థుల నుంచి సమాధానం లేదు. పార్టీల, ప్రజల ఆలోచనలో, ఆచరణలో మార్పు రానంత కాలం ప్రజాస్వామ్యం స్థానంలో ధనస్వామ్యం, రాజకీయ ఆధిపత్యానిదే పెత్తనం. నోట్ల ప్రభావం ఉన్నంతకాలం 'నోటా'తో జరిగేదేమీ ఉండదు.


ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story