ఉన్నది ఉన్నట్టు: అక్కడ డబ్బులు ఊరికే ఎందుకు వస్తున్నాయి?

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: అక్కడ డబ్బులు ఊరికే ఎందుకు వస్తున్నాయి?
X

ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో వందలాది మందిని దించి పార్టీలు విపరీతంగా ఖర్చుపెడుతున్నా ఎన్నికల సంఘం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. నిత్యం వందలాది వాహనాలు, వాటికి చేస్తున్న ఖర్చు, వేలాది మంది కేడర్ అవసరాలకు వెదజల్లుతున్న డబ్బు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విదిలిస్తున్న నోట్లు, ప్రత్యర్థి పార్టీల నుంచి లక్షలు, కోట్లు పెట్టి కండువాలు మార్చే ప్రక్రియ. వీటన్నింటిలో చేతులు మారుతున్న డబ్బుల గురించి పట్టించుకోవడం లేదు. మద్యం, మటన్, బీరు, బిర్యానీ లాంటివి తనకేమీ తెలియదంటూ తప్పించుకుంటున్నది. ఎన్ని నిబంధనలు ఉన్నా చిత్తశుద్ధితో అమలు కానప్పుడు అవి వ్యర్థమే. వాటిలోని లొసుగులే ఉల్లంఘనలకు పాల్పడే పార్టీలకు శ్రీరామరక్ష. అక్రమాలు, అవినీతి, ఓటుకు నోటు, లంచం ఇవన్నీ వ్యవస్థీకృతంగా మారిపోయాయి. 'తిలా పాపం తలా పిడికెడు' తరహాలో వ్యవస్థ అపహాస్యం పాలవుతున్నది.

బ్బులు ఊరకే రావు, ఉప ఎన్నికలొస్తేనే వస్తాయి' ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ సెటైర్ కనిపిస్తున్నది. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఓటర్లకు నోట్ల పండగే. ఉప ఎన్నికలలో ఇది మరింత ఎక్కువ. నిన్న హుజూరాబాద్‌లో చూశాం. ఇప్పుడు మునుగోడులో చూస్తున్నాం. ఊహకు అందని తీరులో పార్టీల అభ్యర్థులు పోటీపడి మరీ పంచుతున్నారు. నీతులు చెప్పే నేతలే ఈ జాడ్యాన్ని అంటించారు. ప్రజలూ దీనికి అలవాటుపడ్డారు. ఓటుకు నోటు ఒక షరతుగా మారింది. నోట్లు ఇవ్వని చోట నిరసనలతో డిమాండ్ చేస్తున్నారు.

ఉప ఎన్నికల టైమ్‌లో ఒక్క నియోజకవర్గానికే వందల కోట్లలో పార్టీలు ఖర్చు చేస్తున్నాయి. 'పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా' కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. ఎన్నికల సంస్కరణల పేరుతో ఎంత కసరత్తు జరుగుతున్నా ఈ జాడ్యం తప్పడం లేదు. కేంద్ర పరిశీలకులు ఉన్నా, వాహనాల తనిఖీలు జరుగుతున్నా, చెక్‌పోస్టులు పెట్టినా, నోట్ల ప్రవాహం ఆగడంలేదు. 'శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు' అన్నట్టుగానే రాజకీయ నాయకులు నోట్ల కట్టలను తరలించడానికి, ఓటర్లకు పంచి పెట్టడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారు.

హక్కుగా మారిన ఓటుకు నోటు

గెలిచిన నేతలు బహిరంగంగానే 'నేను ఇంత ఖర్చు పెట్టి గెలిచాను' అని చెప్పుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ సీలింగ్, నిబంధనలు తూచ్ అని వారి మాటలతోనే అర్థమవుతున్నది. చట్టాలు చేసే నేతలే ఉల్లంఘనలకు పాల్పడడం విశేషం. ఎన్నికలు కోటీశ్వరుల కొట్లాటగా మారిపోయింది. కోట్లాది రూపాయలుంటేనే ఎన్నికలలో పోటీ సాధ్యం. అభ్యర్థిని ఖరారు చేసేటప్పుడు ప్రధాన పార్టీలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఖర్చుచేసే స్థోమత లేనివారికి టికెట్ గగనమే. ఎవరి అఫిడవిట్లు చూసినా కోట్ల రూపాయల ఆస్తులు కనిపిస్తాయి.

అధికారం కోసం అడ్డదారులు తొక్కడం నేటి రాజకీయ నేతల సహజ లక్షణం. వారికి కావాల్సింది ఓట్లు. ప్రజలకు కావాల్సింది నోట్లు. అందుకే ఓటుకు నోటు తీసుకోవడం తప్పు కాదనేది ఓటర్ల లాజిక్. 'నేతలు అక్రమంగా సంపాదించిందే గదా? తీసుకుంటే తప్పేముంది?' అనేది ప్రజల వాదన. నేతలు అక్రమంగా సంపాదించుకోవడానికి అధికారం ఒక లైసెన్సు అయితే, ఎన్నికల సమయంలో నోటు తీసుకోవడం ఓటర్లకు ఒక లెజిటిమేట్ రైట్‌గా మారిపోయింది. దీనికి తోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాలలోకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వస్తాయన్నది జగమెరిగిన సత్యం.

ఉప ఎన్నిక వస్తేనే నిధులు

హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో రాత్రికి రాత్రే సర్కారు నుంచి నిధులు విడుదలయ్యాయి. పనులకు అనుమతులు మంజూరయ్యాయి. ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రజా ప్రతినిధులు స్పందించలేదు. ప్రభుత్వానికీ పట్టలేదు. కానీ ఉప ఎన్నిక రావడంతోనే రోడ్లు, నల్లాలు, వీధి దీపాలు, డ్రైనేజీ పనులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం.. ఇలాంటివన్నీ ఆగమేఘాల మీద మంజూరయ్యాయి. రోజుల వ్యవధిలోనే పనులు పూర్తయ్యాయి. ఓట్ల కోసం, గెలవడం కోసం ఓటర్లను సంతృప్తిపర్చడం అధికార పార్టీ విధానంగా మారింది.

అందుకే ఉప ఎన్నికలు రావాలనే జనం కోరుకుంటున్నది. ఖర్చుపెట్టే స్థోమత లేని వారికి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. నోట్ల పంపిణీ మాత్రమే కాదు. మందు, మటన్, బిర్యానీ, బీర్, గిఫ్టులు.. ఇలాంటివన్నీ కామన్ వ్యవహారమైంది. వినాయకచవిత పండుగకు గణేశ్ మండపాల కోసం స్థానిక యూత్‌కు లక్షలాది రూపాయలు విరాళం రూపంలో ఖర్చుపెట్టారు నేతలు. దసరా పండుగకు మద్యం, మాంసం డోర్ డెలివరీ అయింది. త్వరలో రానున్న దీపావళి పండుగకు కూడా బాణసంచా గిఫ్ట్ ప్యాక్ రూపంలో ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం చాలా కామన్ అనేది సొసైటీలో ఎస్టాబ్లిష్ అయింది.

Also read: ఎన్నికల ముందే 'బంధు'లా! ఇవి కొనసాగేనా?

స్థానిక నేతల తీరే వేరు

ప్రజల తీరు ఇలా ఉంటే స్థానికంగా పార్టీ నేతలుగా చెలామణి అవుతున్న వారి కథ మరోలా ఉంటుంది. నిర్లజ్జగా పూటకో పార్టీ మారుతున్నారు. మారినప్పుడల్లా లక్షలు, కోట్లల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఏ పూటకు ఏ పార్టీలోకి వెళ్తారో వారికే తెలియదు. డబ్బులొస్తే, నామినేటెడ్ పదవులిస్తే అన్నింటినీ వదులుకోడానికి సిద్ధమవుతున్నారు. స్వంత పార్టీ నేతలను కూడా కోట్ల రూపాయలిచ్చి కొనుక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న హుజూరాబాద్‌లో అదే జరిగింది. ఇప్పుడు మునుగోడులో జరుగుతున్నది.

జెండాలు, కండువాలతో పనిలేదు. చేతికి నోట్ల కట్టలొస్తే చాలు. ఇదే స్థానిక నేతలకు కావాల్సింది. టీఆర్ఎస్ తరఫున స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక నేత కోటి రూపాయల ఆఫర్‌తో మరో పార్టీలోకి వెళ్లిపోయాడు. తిరిగి స్వంత గూటికి రప్పించుకునేందుకు రెండు కోట్లు ముట్టచెప్పింది. పది రోజుల వ్యవధిలో ఆ నేతకు మూడు కోట్లు అందాయి. చేర్చుకునే పార్టీలకు బుద్దీ జ్ఞానం లేదు. చేరేవారికి సిగ్గూ ఎగ్గూ లేదు. డబ్బులకు అమ్ముడుపోయాడంటూ ఆ నేతను ప్రజలు చీదరించుకున్నారు. చివరకు ఆ స్థానిక నేత ఒంటరై పోయాడు. చేర్చుకున్న పార్టీ ఇప్పుడు మదనపడుతున్నది. రెండు కోట్లు ఖర్చు చేసినా ఓట్లు పడతాయో లేవోననే టెన్షన్ పట్టుకున్నది.

అప్పుడే ప్రేమ పుట్టుకొచ్చేది

ఎన్నికలొస్తేనే ప్రజలను ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు పలకరిస్తారు. ప్రేమను ఒలకబోస్తారు. వ్యక్తిగత, ఊరు ఉమ్మడి పనులను పట్టించుకుంటారు. ఆ తర్వాత గాలికొదిలేస్తారు. అందుకే తరచూ ఉప ఎన్నికలు వస్తే ఊరి సమస్యలూ తీరుతాయి. ఇంటింటికీ వచ్చి ఏమేం పనులున్నాయో తెలుసుకుని పరిష్కరిస్తారు. కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటారు. సొంత అవసరాలకు ఎంతో కొంత ఇస్తారు. నిత్యం అందుబాటులో ఉంటారు. అనేది ప్రజలలో సాధారణ అభిప్రాయంగా మారిపోయింది.

హుజూరాబాద్ సమయంలో దళితబంధు, మునుగోడు టైమ్‌లో గొర్రెల స్కీమ్‌కు నగదు బదిలీ ప్రజలకు స్వీయానుభవం. ఇక ఎన్నికలలో పోటీ చేసే ఒకరి బండారాన్ని మరో అభ్యర్థి బైటపెడుతుంటారు. ఎవరి లొసుగులేంటో ప్రజలకు తెలిసిపోతుంది. రాజకీయ స్వార్థానికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారనేది టీఆర్ఎస్ వాదన. వేల కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్నందున పార్టీ మారారన్నది ఆ పార్టీ ఆరోపణ. ఉప ఎన్నిక రావడానికి కారణం ఆయనేనంటూ కార్నర్ చేస్తున్నది. దీనికి ప్రజల నుంచే సోషల్ మీడియాలో కౌంటర్ ఘాటుగానే వచ్చింది. ఏ రాజకీయ స్వార్థం లేకుండానే 2018లో అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందా అనే ప్రశ్నకు సమాధానం కరువైంది.

Also read: ఉన్నది ఉన్నట్టు :వారసత్వం లేనిదెక్కడ?

వారికిది పట్టనే పట్టదు

ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో వందలాది మందిని దించి పార్టీలు విపరీతంగా ఖర్చుపెడుతున్నా ఎన్నికల సంఘం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. నిత్యం వందలాది వాహనాలు, వాటికి చేస్తున్న ఖర్చు, వేలాది మంది కేడర్ అవసరాలకు వెదజల్లుతున్న డబ్బు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విదిలిస్తున్న నోట్లు, ప్రత్యర్థి పార్టీల నుంచి లక్షలు, కోట్లు పెట్టి కండువాలు మార్చే ప్రక్రియ. వీటన్నింటిలో చేతులు మారుతున్న డబ్బుల గురించి పట్టించుకోవడం లేదు.

మద్యం, మటన్, బీరు, బిర్యానీ లాంటివి తనకేమీ తెలియదంటూ తప్పించుకుంటున్నది. ఎన్ని నిబంధనలు ఉన్నా చిత్తశుద్ధితో అమలు కానప్పుడు అవి వ్యర్థమే. వాటిలోని లొసుగులే ఉల్లంఘనలకు పాల్పడే పార్టీలకు శ్రీరామరక్ష. అక్రమాలు, అవినీతి, ఓటుకు నోటు, లంచం ఇవన్నీ వ్యవస్థీకృతంగా మారిపోయాయి. 'తిలా పాపం తలా పిడికెడు' తరహాలో వ్యవస్థ అపహాస్యం పాలవుతున్నది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. ఈ వికృత క్రీడలో అందరూ దోషులే. పాలకులు, పార్టీలు, ప్రజలు అనే తేడా లేదు.


ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story

Most Viewed