ఎన్నికల ముందే 'బంధు'లా! ఇవి కొనసాగేనా?

by Viswanth |
ఎన్నికల ముందే బంధులా! ఇవి కొనసాగేనా?
X

సంపద పెంచాలి. దాన్ని పేదలకు పంచాలి. ఇదే ప్రభుత్వ విధానం' అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల పాలనలో సామాన్యుల సంపద పెరిగిందెంత? వారి కాళ్ల మీద వారు నిలబడగలుతున్నారా? ఇంకా 'ఆసరా' ఎందుకు అవసరమవుతున్నది? ప్రభుత్వం నుంచి ఆశించే స్థాయిలోనే ప్రజలు ఎందుకున్నారు? ఉపాధి అవకాశాలపై యువతలో, నిరుద్యోగులలో నిరాశా నిస్పృహలు ఎందుకున్నాయి? మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎంధుకు ఘెరావ్ చేస్తున్నారు? టీఆర్ఎస్ పాలనలో ఎవరి సంపద ఎంత పెరిగిందో లెక్కలు తేలుతాయా? రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో రాజకీయ నాయకులది ఎంతో, సామాన్య ప్రజలది ఎంతో క్లారిటీ వస్తుందా? ప్రభుత్వం ఇచ్చేదిగాను ప్రజలు పుచ్చుకునేవారిగానూ ఉన్నంతకాలం ఈ 'బంధు'లు వస్తూనే ఉంటాయి.

న్నికలు వస్తున్నాయనగానే పార్టీలు రకరకాల హామీలు గుప్పిస్తుంటాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీ అనే తేడా లేకుండా దేశమంతా ఇది కామన్ ప్రాక్టీసుగా మారింది. అధికార పార్టీలలో ఈ మోతాదు కాస్త ఎక్కువే. పవర్‌లోకి రావడమొక్కటే ఇందుకు ఏకైక ప్రాతిపదిక. తెలంగాణలో ఇలాంటి హామీలు అనేకం. తాజాగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 'గిరిజన బంధు' హామీని తెరపైకి తెచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక కొత్త 'బంధు' ఉనికిలోకి వస్తూ ఉన్నది. సామాజిక వర్గాలకు అనుగుణంగా రకరకాల పథకాలను టీఆర్ఎస్ శ్రీకారం చుడుతున్నది.

సంక్షేమం పేరుతో కులాల వారీగా ఓటర్లను చేజారిపోకుండా చూసుకుంటున్నది. మొదటి టర్ములో ఆరు నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018 డిసెంబరులో ఎన్నికలకు వెళ్లడానికి ముందు 'రైతుబంధు' తీసుకొచ్చింది. ఈటల రాజేందర్ రాజీనామాతో 2021 డిసెంబరులో జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా 'దళిత బంధు' తెరపైకి వచ్చింది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో రానున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు 'గిరిజన బంధు' ఉనికిలోకి వస్తున్నది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏ 'బంధు' వస్తుందనే చర్చ మొదలైంది. 'బీసీ బంధు' వస్తుందా? లేక అన్నీ 'బంద్' అవుతాయా అనే వ్యంగ్య డైలాగులూ వినిపిస్తున్నాయి.

అన్నింటినీ మింగేసిన 'రైతుబంధు'

రైతు సంక్షేమం కోసం పంట పెట్టుబడి సాయంగా 'రైతుబంధు'ను ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. ఎకరానికి యేటా రూ.10 వేల చొప్పున రైతులకు అందడం ఉపశమనమే. కానీ, దాని పేరుతో పంటల ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పథకం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అటకెక్కాయి. రైతుల రుణమాఫీ, పంటల రుణ ప్రణాళిక, గిట్టుబాటు ధర సంగతి సరేసరి. రైతులకు ఊతమివ్వడానికే రైతుబంధు అని ప్రభుత్వం చెప్పుకుంటున్నా సాగుచేయని భూస్వాములకూ లక్షలాది రూపాయలు ఇస్తున్నది.

ప్రజాధనం దుర్వినియోగమవుతున్నది. లీగల్ చిక్కుల పేరుతో కౌలు రైతులను ఈ స్కీమ్ నుంచి మినహాయించింది. స్కీమ్ రూపకల్పనలోనే లోపాలున్నాయి. నిజంగా రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయమైనట్లయితే ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలలో దేశంలో నాల్గవ స్థానంలో ఎందుకున్నదో జవాబు చెప్పాలి. ఉచిత ఎరువులను ఇస్తామంటూ 2017 లో సీఎం ఇచ్చిన హామీ అమలుపై క్లారిటీ ఇవ్వాలి.

ప్రభుత్వ ఉద్యోగులకూ 'దళిత బంధు'

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా సుదీర్ఘ కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ 'దళితబంధు' స్కీమ్‌ను తెరపైకి తెచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధికి నోచుకోలేకపోయిన దళిత కుటుంబాలను స్వంత కాళ్లపై నిలబడేలా చేయడమే ఈ స్కీమ్ ఉద్దేశమని చెప్పారు. ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని ఆహ్వానించాల్సిందే. నిజంగా దళితులపట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే భూమి లేని దళిత కుటుంబాలకు తలా మూడెకరాల చొప్పున సాగుభూమిని ఇస్తామన్న హామీ అర్ధంతరంగా ఎందుకు ఆగిపోయినట్లు?

ఆర్థిక సాయం అందించే పథకాలు ఎందుకు అమలు కావడం లేదు? ఎస్సీ డెవలప్‌మెంట్ ఫండ్‌ ఎందుకు దారి మళ్లుతున్నది? వీటికి సర్కారు సమాధానం చెప్పాలి. 'దళిత బంధు' స్కీమ్ అందుకోడానికి లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యేలకు కనీసం రెండు లక్షలు కమిషన్లు ఇవ్వక తప్పడం లేదు. ఆర్థికంగా మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమైనట్లయితే సర్కారు ఉద్యోగులకు సైతం చివరి దశలో ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ సీఎం ప్రకటించడం అర్థరహితం.

ఇప్పుడు 'గిరిజన బంధు'

ప్రభుత్వం ఇప్పుడు 'గిరిజన బంధు' స్కీమ్‌ తేనున్నట్లు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. గిరిజనులకు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోసం రాష్ట్రం ఇప్పటికే తీసుకొచ్చిన 'ట్రైకార్' రుణాలు, 'టీ-ప్రైడ్' సాయం సక్రమంగా అమలు కావడం లేదు. దరఖాస్తులకు క్లియరెన్స్ రావడం లేదు. పోడు భూముల విషయంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భిన్నాభిప్రాయాల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నది. అటవీ సిబ్బందిపై ఆదివాసీ రైతులు తిరగబడుతున్నారు. హరితహారం పేరుతో మొక్కలు నాటి ఆదివాసీలను పోడు వ్యవసాయం నుంచి పథకం ప్రకారమే దూరం చేస్తున్నది. ఆ వ్యతిరేకత నుంచి గట్టెక్కడానికి 'గిరిజన బంధు' తెరపైకి వచ్చింది.

ఇక మిగిలింది 'బీసీ బంధు'?

ఒక్కో ఎన్నిక సందర్భంగా ఒక్కో 'బంధు' పథకాన్ని ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు 'బీసీ బంధు' తీసుకొస్తుందేమో అనే చర్చలు మొదలయ్యాయి. 'మైనారిటీ బంధు', 'మహిళా బంధు' లాంటివీ వస్తాయేమోననే చర్చలు సరేసరి. ఒక సందర్భంలో ముఖ్యమంత్రే అందరికీ 'బంధు' ఉంటుందన్నారు. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇవ్వలేని ప్రభుత్వం మరో ఏడాదిలో అన్నింటినీ బంద్ పెడుతుందేమో అనే సెటైర్లూ వినిపిస్తున్నాయి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందునే తిరిగి దగ్గర చేసుకోడానికి ఈ పథకాలు ఉనికిలోకి వస్తున్నాయి. టీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గినందునే ఆకర్షణీయమైన పథకాలు అనివార్యమవుతున్నాయి. ఎన్నికల సమయంలో వీటిని ప్రకటించడమంటే ఆయా వర్గాల ప్రజలను దగ్గర చేసుకోవడానికి టీఆర్ఎస్ అధినేత వేస్తున్న ఎత్తుగడలే.

పథకాల కోసం భూముల అమ్మకం

రైతుబంధు కోసం యేటా రూ.15 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.1500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లను ఈ ఏడాది కేటాయించింది. గిరిజన బంధు కోసం సుమారు రూ.15,000 కోట్లు అవసరం కావొచ్చు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు.. ఇలాంటి సంక్షేమ పథకాలకు నిధులు తప్పదు. పన్నుల ద్వారా స్వంతంగా సమకూర్చుకుంటున్న ఆదాయంలో ముప్పావు శాతం వీటికే ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. మరో మార్గం లేక సర్కారు భూములను అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదు.ఇప్పటికే హెచ్ఎండీఏ భూములు, రాజీవ్ స్వగృహ ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. తొందరలో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా భూములనూ అమ్ముకోనున్నది. దళితులకు మూడెకరాల భూమి దొరకకున్నా అమ్ముకోడానికి మాత్రం పుష్కలం.

'సంపద పెంచాలి. దాన్ని పేదలకు పంచాలి. ఇదే ప్రభుత్వ విధానం' అంటూ సీఎం వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల పాలనలో సామాన్యుల సంపద పెరిగిందెంత? వారి కాళ్ల మీద వారు నిలబడగలుతున్నారా? ఇంకా 'ఆసరా' ఎందుకు అవసరమవుతున్నది? ప్రభుత్వం నుంచి ఆశించే స్థాయిలోనే ప్రజలు ఎందుకున్నారు? ఉపాధి అవకాశాలపై యువతలో, నిరుద్యోగులలో నిరాశా నిస్పృహలు ఎందుకున్నాయి? మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎందుకు ఘెరావ్ చేస్తున్నారు? టీఆర్ఎస్ పాలనలో ఎవరి సంపద ఎంత పెరిగిందో లెక్కలు తేలుతాయా? రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో రాజకీయ నాయకులది ఎంతో, సామాన్య ప్రజలది ఎంతో క్లారిటీ వస్తుందా? ప్రభుత్వం ఇచ్చేదిగాను ప్రజలు పుచ్చుకునేవారిగానూ ఉన్నంతకాలం ఈ 'బంధు'లు వస్తూనే ఉంటాయి. ఇలాంటి తాయిలాలను చూపుతూ పవర్‌లోకి రావడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉంటాయి.

ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story

Most Viewed